ఆర్థిక కష్టాల్లో ఉన్నామని రోజువారీ ఖర్చులకూ సమస్యలు వస్తున్నాయని అనుకుంటున్నత తెలంగాణ ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రకటించింది. చీఫ్ సెక్రటరీ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎవరూ ఇక నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేసింది. సెమినార్లు, స్టడీటూర్లు, కాన్ఫరెన్స్‌లు అన్నింటినీ బ్యాన్ చేసింది. తప్పనిసరిగా వెళ్లాల్సినది అయితే.. అత్యంత తక్కువ ఖర్చుతో వెళ్లాలని ఆదేశించింది.
ఇక వాహనాల వినియోగం, కొత్త వాహనాల కొనుగోలు విషయంలోనూ అనేక ఆంక్షలు పెట్టింది. కొత్త వాహనాల కొనుగోలుపై పూర్తిగా బ్యాన్ విధించింది. వాహనాల రీప్లేస్ మెంట్ కూడా వద్దని స్పష్టం చేసింది. ఇక ఆఫీసుల్లో విద్యుత్ వాడకంపై పాత ఆదేశాలను మరోసారి జారీ చేశారు. అవసరం లేనప్పుడు.. వాడనప్పుడు అన్ని ఉపకరణాలు ఆపేయాలన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత గాడ్జెట్స్ విషయంలోనూ అంతే.
అయితే ఈ ఆదేశాలను చూసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ ఇంత ఘోరంగామారిందా అన్న సందేహాలను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. అంచనాలకు తగ్గట్లుగా ఆదాయాలు రాకపోవడంతో ఎక్కువ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. సాధారణంగా అప్పులు.. ఇతర వనరుల ద్వారానే పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేయాలి. ఆదాయం అంతా ప్రభుత్వ నిర్వహణకు సరిపెట్టుకోవాలి. ఇప్పుడు అది కూడా సరిపోవడం లేదన్న వాదన వినిపిస్తోంది.