తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో ప్రతీ రోజూ దళిత ఎజెండా గురించే మాట్లాడుతున్నారు. వారిని పైకి తీసుకు రావడం గురించే నిరంతరం ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచన శైలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ కనిపించింది. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన కేసీఆర్.. తన ప్రసంగంలో దళితుల ఉద్దరణ గురించే ఎక్కువగా మాట్లాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజల పేదరికంలో ఉన్నారని… దానికి తెలంగాణ కూడా అతీతం కాదన్నారు. ఇప్పటికీ వారిపై వివక్ష ఉందన్నారు. దళిత సమూహాన్ని అణిచి వేస్తే దేశం కుప్పకూలిపోతుందని వ్యాఖ్యానించారు. వీలయినంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాల్సి ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి తమ ప్రభుత్వం దళితల అభ్యున్నతికి తీసుకున్న చర్యల గురించి కేసీఆర్ వివరించారు.
దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ జరిగిందిఒక ఎత్తు అయితే ఇక ముందు జరగబోయేది మరో ఎత్తు అని ప్రకటించారు. దళితబంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నామని… స్వశక్తితో, స్వావలంబనతో దళితులు జీవించేలా చేస్తామన్నారు. దళిత బంధు పథకం అందరి జీవితాల్లో సమూల మార్పులు చేస్తుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పైలట్ ప్రాజెక్ట్‌గా సంపూర్ణంగా అమలు చేసి..ఇతర నియోజకవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చేరూ. పది లక్షలు పూర్తిగా ఉచితమని.. బ్యాంకులకు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణకు సంబందించి గత ఏడేళ్ల పాలనలో సాధించిన విజయాలపైనా కేసీఆర్ ప్రసంగించారు. అయితే అన్నింటికన్నాఎక్కువగా దళిత బంధు పథకం గురంచి చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దళితులందరికీ ఇస్తామని కాకుండా… ఇతర నియోజకవర్గాల్లో పాక్షికంగాఅమలు చేస్తామని చెప్పడం ద్వారా.. ఇతర నియోజకవర్గాల్లో వంద మందికి మాత్రమే ఇస్తారేమోనన్న అభిప్రాయాన్ని కల్పించారు. ఈ అంశంపై హుజూరాబాద్ ఉపఎన్నికలు ముగిసిన తర్వాతే స్పష్టత వస్తుంది. అయితే దళితుల ఓటు బ్యాంకే లక్ష్యంగా చేసుకుంటున్నకేసీఆర్… ఆగస్టు పరదిహేనోతేదీ వేడుకల్ని కూడా దళితులను ఆకట్టుకోవడానికే ప్రయత్నించడం ..ఈ విషయంలో ఆయనెంత సీరియస్‌గా ఉన్నారోఅర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.