రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కృష్ణా బోర్డు ఇచ్చే నివేదికపై తెలంగాణ ముందుగానే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి కారణం.. కమిటీలో తెలంగాణకు చెందిన అధికారులు ఉంటే… పరిశీలనకు రావొద్దన్న ఏపీ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఎన్డీటీ అందరూ తెలుగేతర అధికారులతోనే వెళ్లాలని సూచించింది. ఆ మేరకు కమిటీ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించింది. అయితే.. అనూహ్యంగా ఏపీకి చెందిన ఉన్నతాధికారులు ఈ కమిటీని కలిశారు. సీమ ఎత్తిపోతల వద్ద వివరణ ఇచ్చారు. ఏపీ ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీంతో తెలంగాణ ఏదో జరుగుతోందని అనుమానిస్తోంది.
తమ అధికారులు లేకుండా తనిఖీలు చేయడే కాకుండా ఏపీ అధికారులను ఎందుకు భాగస్వామ్యం చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు నీటిపారుల ఉన్నతాధికారి రజత్ భార్గవ… కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. కమిటీ నివేదిక నిష్పాక్షికతపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తమకు నచ్చినట్లుగా లేకపోతే తెలంగాణ సర్కార్ అంగీకరించేపరిస్థితి లేదు. మరిన్ని ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల అంశం మొదటి నుంచి వివాదాస్పదంగామారింది. తాము కట్టడం లేదని ఏపీసర్కార్ మొదట వాదించింది. అయితే తర్వాత అక్కడ సన్నాహాక నిర్మాణాలు చేస్తున్నామని చెబుతోంది.
పర్యావరణ అనుమతులు రాకుండానే ప్రాజెక్టు చేపట్టం సరి కాదన్న ఎన్జీటీ ఆదేశాలనూ ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు కేఆర్ఎంబీ బోర్డు సభ్యులు సీమ ఎత్తిపోతులను సందర్శించారు. నివేదిక తాము అనుకున్నట్లుగా వస్తే సంతోషిస్తారు..లేకపోతే ఆరోపణలు చేయడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధమయ్యాయయని.. తాజా పరిణామాల ద్వారా అంచనా వేయవచ్చునని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.