ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యహారం అనేక మలుపులు తిరుగుతోంది. సూత్రధారి రాజగోపాల్ రెడ్డి ఒక్కడేనని, కొందరు ఏజెంట్ల ద్వారా కథ నడినిపంచారని మొదట సి ఐ డి అధికారులు భావించారు. అయితే రోజురోజుకూ కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీకి చెందిన వారు లీకేజీకి బాధ్యులని గుర్తించారు. గుడ్డూ, నిషాద్, ఖలీల్, ఇక్బాల్ లు కూడా లీకేజీ సూత్రధారులేనని నిర్ధారణ అయింది. నల్గొండ జిల్లాలో మరో బ్రోకర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా పంజాబ్ లో రామకృష్ణ అనే బ్రోకర్ ను శనివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒక వ్యక్తి, లేదా ఒక ముఠా కాదు. అనేక ముఠాలు ఎవరికి వారుగా ప్రశ్నపత్రాలను ముందే సంపాదించారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. బెంగళూరు నుంచి పంజాబ్ వరకూ ఈ దందా విస్తరించింది. హైదరాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చాలా మంది విద్యార్థులకు పల్లీ బఠాణీల్లా ప్రశ్న పత్రాలను పంచిపెట్టారు. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేశారు. ఇంత జరుగుతున్నా నిఘా యంత్రాంగం ఏం చేస్తోందనేది ప్రశ్న.
ఇన్ని జిల్లాల్లో విద్యార్థుల చేతికి ప్రశ్న పత్రాలు అందినా, కొందరు టీచర్లే తమ పిల్లల కోసం లక్షలు వెచ్చించి వీటిని కొనుగోలు చేసినా
ఇంటెలిజెన్స్ విభాగం పసిగట్టలేక పోయింది. ఇంత పెద్ద వ్యవస్థీకృత నేరం ఇన్ని రోజుల పాటు జరుగుతూ ఉన్నా నిఘా అధికారుల దృష్టి రాకపోవడం అంటే అది ఘోర వైఫల్యమే. పైగా, ప్రశ్నపత్రం రెండు రోజుల ముందు లీకైందనేది నిజం కాదని తెలుస్తోంది. కనీసం రెండు వారాల ముందే సదరు బ్రోకర్లు ప్రశ్నపత్రాలను సంపాదించారన్నది తాజా సమాచారం. ఢిల్లీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వీరందరికీ ఒకే వ్యక్తి ప్రశ్న పత్రాలను ఇచ్చాడా లేక ఎవరికి వారు తమకు తెలిసిన వారి ద్వారా లీకేజీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం మొదటి తప్పిదం. ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత నిఘా వైఫల్యం వల్ల ఇంత పెద్ద బాగోతం సాఫీగా జరిగిపోయింది. ఒక విద్యార్థిని తండ్రి సాహసం వల్ల ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.