ఇంటర్ బోర్డు నిర్వాకంతో వందలాది మంది పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. ఊహించని విధంగా, బోర్డు నిర్వాకంతో ఫెయిల్ అనే రిజల్ట్ వచ్చిన విద్యార్థులు కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్ బోర్డు నిర్వాకానికి నిరసనగా పిల్లలు, వారి తల్లిదండ్రులు కలిసి ఇంటర్ బోర్డు ముందు ధర్నాలు చేశారు. ఇంటర్ బోర్డు ముందు వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇద్దరు విద్యార్థులని అరెస్టు చేశారు. ఇంత జరుగుతుంటే అటు మీడియా, ఇటు కొన్ని రాజకీయ పార్టీలు, అటు మరి కొందరు ప్రముఖుల వ్యవహార శైలి ప్రజలకు మింగుడు పడడం లేదు.
ఇంటర్ బోర్డు నిర్వాకం, తప్పిదం ఒప్పుకున్న బోర్డు కార్యదర్శి:
పరీక్షకు హాజరైన విద్యార్థులకు, ఆబ్సెంట్ అని రావడం, ముందురోజు సున్నా మార్కులు అని ఒక విద్యార్థినీకి ఫలితం ప్రకటించగా, తర్వాత మరుసటి రోజున 99 మార్కులు అని బోర్డు సవరించిన మార్క్ లిస్టు విడుదల చేయటం, కొంతమంది విద్యార్థులు తాము ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఫలితాలు రావడంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటి సంఘటనల మధ్య, దాదాపు ఇరవై ఒక్క వేల జవాబు పత్రాలు గల్లంతైనట్లు ప్రచారం జరగడం- వెరసి ఇంటర్ బోర్డు నిర్వాకం, వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ దీనిపై వివరణ ఇచ్చారు. గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ సేవలు తీసుకున్నామని, ఆ క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, 9 కి బదులుగా 0 బబ్లింగ్ చేయడం వల్ల 99 మార్కులు రావలసిన విద్యార్థులకు సున్నా మార్కులు వచ్చినట్టుగా చూపించబడింది అని, అయితే జవాబు పత్రాలు మాత్రం గల్లంతు కాలేదని వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణ ఇస్తున్న సమయంలో కూడా ఇంటర్ బోర్డు వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ నినాదాల మధ్యే ఆయన వివరణ ఇచ్చారు.
విద్యార్థులకు అండగా విపక్షాలు:
అయితే ఇది ఏదో చిన్న సమస్య అనుకున్న రాజకీయ పార్టీలకు, సమస్య తీవ్రత అర్థం కావడం, పైగా కెసిఆర్ కు భయపడో మరింకెందుకో కానీ, మీడియా కూడా చాలా వరకు సమస్యలను అండర్ ప్లే చేయడానికి ప్రయత్నించడంతో, విపక్షాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తో పాటు, జనసేన పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేసింది. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు గా భావించాలని, ప్రభుత్వం బాధ్యత వహించాలని వ్యాఖ్యానిస్తే, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తెలంగాణ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసింది అని మరొక కాంగ్రెస్ నేత శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఒక కమిటీని వేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దారుణమని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
నోట్లో గుడ్డలు కుక్కుకున్న ప్రముఖులు?
అయితే ఆంధ్రప్రదేశ్లో చీమ చిటుక్కుమన్నా, చిన్న పొరపాటు జరిగినా ఎగేసుకుంటూ వచ్చి పెద్ద పెద్ద వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేసే ప్రముఖులు ఇప్పుడేమైపోయారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ ప్రముఖుల మీద ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా మొన్నటికి మొన్న ఫీజు రియంబర్స్మెంట్ కాస్త ఆలస్యమైనందుకు పెద్ద సీన్ క్రియేట్ చేసిన మోహన్ బాబు మీద, తెలుగుదేశం పార్టీ ఏ చిన్న పొరపాటు చేసినా, తీవ్ర పదజాలంతో విరుచుకుపడే పోసాని కృష్ణమురళి మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వీరి మీదే కాకుండా, ఇటీవల మీడియా ముందు మైకు పట్టుకొని పదునైన వ్యాఖ్యలు చేసిన శివాజీ రాజా, జీవిత రాజశేఖర్, చిన్నికృష్ణ లాంటివారి మీద , అలాగే ప్రపంచంలోని ప్రతి సమస్య మీద మాట్లాడడానికి తమకే పేటెంట్ హక్కు ఉన్నట్టుగా వ్యాఖ్యలు చేసే కత్తి మహేష్ , శ్రీ రెడ్డి లాంటి వారి మీద కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడడానికి వీరికి గొంతు ఎందుకు పెగలడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఎందుకు పనికి రాని విషయాల మీద రోజుకు పదేసి ట్వీట్లు పెట్టే విజయసాయి రెడ్డి లాంటి నాయకులు తెలంగాణలో బిడ్డలు చనిపోతే ఎందుకని స్పందించడం లేదంటూ, వారు ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద చూస్తే, తెలంగాణలో ఇంటర్ బోర్డు నిర్వాకం అటు పిల్లల భవిష్యత్తు తో ఆడుకుంటుంటే, దాని మీద నోరు మెదిపితే ఎక్కడ కెసిఆర్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని భయపడుతున్న ఈ ప్రముఖుల వ్యవహారం ప్రజలకు వెగటు పుట్టిస్తోంది.