తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల ఇప్పటికే 18 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రశ్నార్థకం చేసిందని బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా పేరెంట్స్ మరియు విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు వచ్చి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కుందామని ప్రయత్నిస్తుంటే ఆఫీసు లోపలికి కూడా వీరిని అనుమతించకపోవడంతో ఇంటర్మీడియట్ బోర్డ్ పరిసరప్రాంతాలు ఉద్రిక్త వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొంతమంది పేరెంట్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి.
ఒక పేరెంట్ మాట్లాడుతూ, అసలు ఇంత అన్యాయమైన పరిస్థితి ఏంటని, తమ బిడ్డల భవిష్యత్తు ఇప్పుడు ఏం కావాలని ప్రశ్నిస్తూ, ” నేను తెలంగాణ వాడిని అయినప్పటికీ చెబుతున్నా, కనీసం ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడే పరిస్థితి కాస్త బాగుండేది. ఇప్పుడైతే ఇంటర్మీడియట్ బోర్డ్ పూర్తిగా భ్రష్టు పట్టి పోయింది” అంటూ వ్యాఖ్యలు చేశారు. అగ్ర టీవీ ఛానల్ ఇస్తున్న లైవ్ లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఫ్ కోర్స్, ఏ ఛానల్ కూడా ఆయన వ్యాఖ్యలను హైలెట్ చేయడం కానీ, కెసిఆర్ కి వ్యతిరేకంగా ఒక పేరెంట్ చేసిన వ్యాఖ్యల లోని ఆవేదన ని ప్రతిఫలించే లాగా డిస్కషన్ పెట్టడం కానీ చేయలేదనుకోండి , అది వేరే విషయం.
ఏది ఏమైనా, గత 15 ఏళ్లుగా ఒక్కసారి కూడా ఒక సమస్య కూడా రాకుండా పరీక్షలు నిర్వహించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థని పక్కనపెట్టి 2018లో ఏమాత్రం అనుభవం లేని, పైగా పలు యూనివర్సిటీలతో ఇప్పటికే కోర్టు కేసులో ఇరుక్కొని ఉన్న గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించడమే అంతటికి కారణం అని తెలుస్తోంది. ఈ సమస్యకు ప్రభుత్వం ఎంత త్వరగా పరిష్కారం చూపిస్తే, తల్లిదండ్రులకు ఇటు విద్యార్థులకు టెన్షన్ తగ్గించిన వారవుతారు.