తెలంగాణ ఇంటర్ బోర్డ్ నిర్వాకం కారణంగా ఈ ఏడాది అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజుల పాటు తల్లిదండ్రులు విద్యార్థులు జరిపిన ఆందోళన తర్వాత స్పందించిన ప్రభుత్వం, ఫెయిల్ అయిన విద్యార్థుల అన్ని పేపర్ లను తాము రీవాల్యుయేషన్ చేయిస్తామని, పొరపాట్లు అన్ని సవరించుకుని ఫలితాలను మళ్లీ విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా వెలుగులోకి వస్తున్న వాస్తవాలు చూస్తుంటే తెలంగాణ ఇంటర్ బోర్డ్ తన పొరపాట్లను ఏమాత్రం సరిదిద్దుకో లేదనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. అనామిక అనే అమ్మాయి, పరీక్షలో కేవలం 20 మార్కులు వచ్చి ఫెయిల్ అయింది అన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత విద్యార్థుల అందరి పేపర్లను రీవాల్యూయేషన్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆ అమ్మాయికి కేవలం ఒకే ఒక్క మార్కు పెరిగి ఇరవై ఒక్క మార్కులు వచ్చాయి అని ప్రకటించింది. ఆ మేరకు వెబ్సైట్లో ఫలితాలు కూడా ఇచ్చింది. మళ్లీ ఆ తర్వాత ఆ అమ్మాయి కి 48 మార్కులు వచ్చినట్లుగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ వివరాలను కూడా వెబ్సైట్లలో ప్రకటించింది. అయితే దీని తర్వాత మళ్లీ మరొకసారి ఆ మార్పులను సవరించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్, క్లర్క్ చేసిన పొరపాటు కారణంగా 48 మార్కులు వచ్చాయి అని, అమ్మాయికి వచ్చింది ఇరవై ఒక్క మార్కు లేనని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులలో ఎవరు కూడా రి వాల్యుయేషన్ అనంతరం పాస్ కాలేదని ప్రకటించింది.
ఇంటర్మీడియట్ బోర్డు మీద అ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి జరిగితే పొరపాటు అని సరిపెట్టుకోవచ్చు కానీ పదే పదే అదే పొరపాట్లు చేయడం, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం ఎంతవరకు క్షమార్హం అని విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పొరపాటు జరిగి యావత్ రాష్ట్రం చీవాట్లు పెట్టినప్పటికీ, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కు సిగ్గు రాలేదని, పొరపాట్లు సరిదిద్దుకోవాలి అన్న ఉద్దేశ్యం కంటే కూడా, ఏదో ఒకలాగా ఈ విద్యా సంవత్సర ఫలితాలకు సంబంధించిన సమస్యను ముగించి వేయాలి అన్న ఉద్దేశ్యమే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కు కనిపిస్తోందని వారు అంటున్నారు.
ప్రభుత్వం కూడా ఇది కేవలం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కు సంబంధించిన వ్యవహారం లాగా చూడకుండా, తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పూర్తిగా పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు