పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ జన సమితి సిద్ధమౌతోంది. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో తమ పార్టీ పోటీ పడుతుందని కోదండరామ్ ప్రకటించారు. అంతేకాదు, గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్న ఆసక్తి ఉన్నవారు ఈ ఎన్నికలను అవకాశంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ తరఫున పోటీ చేయాలని ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు కోదండరామ్ చెప్పారు. గ్రామాభివృద్ధి అత్యంత కీలకమైందనీ, జన సమితి ప్రధాన లక్ష్యాల్లో ఇదీ ఒకటని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఇప్పటికే ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ మొదలైంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలను పెట్టారు. గ్రామ పంచాయతీల పాలక వర్గాల ప్రస్తుత పదవీ కాలం జులై 31తో ముగుస్తుంది. ఈ గడువు ముగిసేలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలను తమకు తొలి అవకాశంగా మార్చుకునేందుకు కోదండరామ్ ప్రయత్నిస్తున్నారు. అన్ని పంచాయతీల్లో పోటీకి దిగడం ద్వారా పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లొచ్చని అనుకుంటున్నారు. ఇదే సమయంలో జిల్లాలవారీగా పార్టీ బలోపేతం చేసే చర్యలపై కూడా దృష్టి పెడుతున్నారు. వివిధ జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను నియమించాలనీ నిర్ణయించారు. వారి ద్వారా పార్టీని ప్రజలకు మరింత చేరువ చెయ్యాలని భావిస్తున్నారు దీంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు.
గ్రామస్థాయిలో పోటీ ద్వారా అక్కడి నుంచి పార్టీ నిర్మాణం మొదలౌతుందని కోదండరామ్ భావిస్తున్నారు. అయితే, ఓరకంగా ఈ ఎన్నికలు తెలంగాణ జన సమితి పార్టీకి తొలి పరీక్ష అని చెప్పొచ్చు. తెరాస కూడా మొదట్లో ఇలానే పంచాయతీ స్థాయి నుంచి ప్రభావం చూపింది. ఇప్పటికీ ఆ విజయం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ చెబుతుంటారు. కాబట్టి, టీజేయస్ కూడా ఈ ఎన్నికల్ని చాలా సీరియస్ తీసుకోవాలి. అనూహ్యంగా భారీ విజయం సాధించలేకపోయినా, కనీసం గట్టి పోటీ ఇచ్చారనే ఇమేజ్ తెచ్చుకోవాల్సి ఉంది. అది రాష్ట్రవ్యాప్త ప్రచారానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏమాత్రం తేడా వచ్చినా… జన సమితి ప్రభావం ఇంతే అంటూ తెరాస లాంటి పార్టీల ఎదురుదాడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి, ఈ అవకాశాన్ని ఎంత బాగా వినియోగించకుంటారో అనేద ప్రశ్న.. ?