తెలంగాణలో రఘు అనే జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అతనిపై నల్లగొండ జిల్లా గుర్రంపోడులో పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్ ఉపఎన్నికకు ముందు బీజేపీ నేతలు గుర్రంపోడులో గిరిజనుల భూములు ఆక్రమించుకున్నారని ఆందోళన చేశారు. ఆ సమయంలో పెట్టిన కేసుల్లో పద్దెనిమిది మంది బీజేపీ నేతలు ఉన్నారు. పందొమ్మిదో నిందితుడిగా రఘు ఉన్నారు. ఆయన మీడియా కవరేజ్ కోసం వెళ్లారు. ఆ కేసులో పద్దెనిమిది మంది కళ్ల ముందు తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు రఘును మాత్రం … కిడ్నాప్ చేసుకెళ్లారు.
రఘు మల్కాజిగిరిలో నివాసం ఉంటారు. కూరగాయలు కొనేందుకు ఉదయమే బయటకు వచ్చారు. ఓ బండి వద్ద కూరగాయలు కొంటున్న సమయంలో రెండు కార్లు రావడం.. అందులో నుంచి కొంత మంది వ్యక్తులు దిగడం.. అచ్చంగా ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ మాదిరిగా.. ఎత్తుకెళ్లిపోవడం ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి. వచ్చిన వారికి పోలీస్ డ్రెస్ లేదు. వచ్చిన వారు పోలీస్ వాహనాల్లో రాలేదు. దీంతో ఇప్పుడు ప ోలీసులు ప్రొఫెషల్ కిడ్నాపర్లుగా మారారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఎవరైనా ఓ వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారంటే…చేయాలంటే.. దానికో ప్రక్రియ ఉంటుంది. కిడ్నాపర్లుగా వచ్చి ఎత్తుకెళ్లిపోవడం ఎక్కడా లేదు. దీంతో పోలీసులు పరిధి దాటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల నుంచి పోలీసుల తీరుపై.. టీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలన్నీ తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ.. తెలంగాణలో జర్నలిస్టు సంఘాలు మాత్రం నోరు మెదపడంలేదు. ఓ జర్నలిస్టుపై ప్రభుత్వం ఇంత దమనకాండకు పాల్పడినప్పటికీ.. అది రాజకీయ కేసు అని తెలిసినా… రఘు కోసం నోరెత్తడం లేదు. రఘు ఒకప్పుడు.. మోజో టీవీలో చేశారు. టీవీ9 యాజమాన్యంతో ఏర్పడిన వివాదాలతో ఆ సమయంలోనూ ఆయనపై కేసులు పెట్టారు. ఆ తర్వాత రాజ్ టీవీతో పాటు కొన్ని వెబ్ సైట్స్ కోసం పని చేస్తున్న రఘు భూఆక్రమాలపై విస్తృతంగా రిపోర్ట్ చేస్తున్నారు. ఈ కోణంలోనే అధికార పార్టీ నేతలకు టార్గెట్ అయ్యారంటున్నారు. జర్నలిస్టులపై ప్రభుత్వం ఈ స్థాయిలో వేధింపులకు దిగినా… జర్నలిస్టు సంఘాలు స్పందించకపోవడం.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.