అందరికీ న్యాయం చెప్పే న్యాయమూర్తులకే అన్యాయం జరిగితే? అన్యాయం జరిగిందని వారే రోడ్లెక్కితే…రాజీనామాలకి సిద్దపడితే..ఏమవుతుంది? అందరూ ఆలోచించవలసిన విషయమే. ప్రస్తుతం తెలంగాణాలో అదే జరుగుతోంది.
తెలంగాణా న్యాయస్థానాలలో న్యాయమూర్తులు, సిబ్బంది కేటాయింపులో తమకి అన్యాయం జరుగుతోందంటూ గత నెలరోజులుగా న్యాయవాదులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో దిగువ కోర్టులలో న్యాయమూర్తులు కూడా వారితో కలిసి ఉద్యమానికి సిద్దం అయ్యారు. అందరూ తమ పదవులకి రాజీనామా చేయాడానికి సిద్దం అయ్యారు. మొదట గవర్నర్ నరసింహన్ న్ని కలిసి ఆయనకి విజ్ఞప్తి పత్రం, తమ రాజీనామా లేఖలు ఇవ్వాలనుకొన్నారు. గవర్నర్ ని కలిసేందుకు వారు గన్ పార్క్ నుంచి నిన్న ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారిని అడ్డగించారు. చివరికి వారి తరపున ఐదుగురు ప్రతినిధులని మాత్రం గవర్నర్ ని కలిసేందుకు పోలీసులు అనుమతించారు. న్యాయమూర్తుల కేటాయింపులని పునసమీక్షించవలసిందిగా హైకోర్టుని కోరాలని వారు గవర్నర్ నరసింహన్ని అభ్యర్ధించారు. ఉమ్మడి హైకోర్టు విభజన కోసం చొరవ చూపాలని వారు గవర్నర్ని కోరారు.
ఇంతవరకు న్యాయవాదులు మాత్రమే రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారు ఇప్పుడు న్యాయమూర్తులు కూడా రోడ్లెక్కారంటే పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుక్లోవచ్చు. వారి ఉద్యమం వలన తెలంగాణాలో న్యాయవ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. ప్రజాస్వామ్యానికి మూలస్థంభం వంటి న్యాయవ్యవస్థ పనిచేయడం మానేస్తే ఏమవుతుందో బహుశః రాజకీయ పార్టీలకి, ప్రభుత్వాలకి కూడా తెలిసే ఉంటుంది. అయినా ఇంత నిర్లిప్త ధోరణి ప్రదర్శించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రతీ చిన్న విషయానికి రోడ్లెక్కి ఉద్యమాలు చేసే ప్రతిపక్ష పార్టీలు కూడా వారి పోరాటాన్ని పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సమస్యతో తమకి సంబంధం లేనట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సమస్యని అవి పట్టించుకోకపోతే మరెవరిది ఆ బాధ్యత?
ఇంతకంటే ఇంకా సంక్లిష్టమైన అనేక సమస్యలని పరిష్కరించిన హైకోర్టు, తన స్వంత వ్యవస్థలోనే ఇంత అశాంతి నెలకొని ఉన్నప్పుడు ఎందుకు మౌనం వహిస్తోందో తెలియదు. కానీ అందరి నిర్లిప్త వైఖరితో న్యాయవ్యవస్థని రోడ్డుకీడ్చి దాని గౌరవాన్ని మంటగలుపుతున్నామని గ్రహిస్తే బాగుంటుంది. న్యాయవ్యవస్థపై న్యాయమూర్తులకి, న్యాయవాదులకే నమ్మకం లేకపోతే ఇంకా ప్రజలకి ఉంటుందా? అని సమ్మె చేస్తున్న న్యాయమూర్తులు, లాయర్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.