వ్యవసాయం… మనదేశంలో అత్యధికులు ఆధారపడే ప్రాథమిక రంగం. అలాగే, నిరంత సమస్యలతో అత్యంత నిరాదరణకు గురౌతున్న రంగం కూడా ఇదే! దేశానికి వెన్నెముక రైతు అని నాయకులందరూ చెబుతున్నారు. కానీ, రైతన్నలో ఓటరు మాత్రమే చూసే రాజకీయ పార్టీలే ఎక్కువ. అందుకే వ్యవసాయ సమస్యలపై దీర్ఘకాలిక పరిష్కారమార్గాలను అన్వేషించేవారు తక్కువ. కానీ, తెలంగాణ సర్కారు ఇన్నాళ్లకు ఒక మంచి ప్రయత్నమే చేసిందని చెప్పాలి. వ్యవసాయానికి పెట్టుబడి అందించేందుకు రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 58 లక్షల మందికి రెండు విడుదలతో పెట్టుబడిని చెక్కుల ద్వారా అందిస్తున్నారు. భారతదేశ చరిత్రలోనే ఇదో సువర్ణాధ్యాయమనీ, దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తుందని ఈ పథకం ప్రారంభం సందర్భంగా కేసీఆర్ అన్నారు.
రెవెన్యూ శాఖ వివరాల ప్రకారం 58 లక్షల 33 వేల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. 1 కోటి 43 లక్షల ఎకరాల భూములకు ఈ సాయం అందనుంది. ఇంత భారీ ఎత్తున ప్రారంభించిన ఈ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ఒక ప్రత్యేక వెబ్ సైట్ పెట్టారు. 8 బ్యాంకుల ద్వారా చెక్కుల ఇవ్వనున్నారు. అంతేకాదు, రూ. 50 వేలలోపు సాయం అందుకునేవారికి సింగిల్ చెక్ ఇవ్వనుంది. ఇంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే రెండు చెక్కులు ఇస్తున్నారు. ఈ చెక్కుల చెల్లుబాటు కాలం మూడు నెలలు. వ్యవసాయ, ఉద్యానవన, సహకార, ఆర్డీవోల పర్యవేక్షణలో ఈ చెక్కుల పంపిణీ జరుగుతోంది. అంతేకాదు, ఈ రైతు బంధు పథకం కింద నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆర్నెల్లపాటు వడ్డీ రాయితీని కూడా రైతులకు ఇస్తున్నారు. ఓపక్క రైతులకు చెక్కులు ఇస్తూనే, బ్యాంకుల్లో నగదు లభ్యతపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే, ఆర్బీఐ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని బ్యాంకులకు పెద్దమొత్తంలో నగదు కూడా చేరింది.
కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టు ఇది ఎన్నికల ముందు జనాన్ని ఆకర్షించే పథకం అనే మాటను పక్కనపెడితే… రైతులకు పెట్టుబడి సాయం అందించడం అనేది కచ్చితంగా మెచ్చుకోదగ్గ ఆలోచనే. వేసిన పంట పోయి, పండినా మద్దతు ధర రాక, చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో రైతాంగం ఉంది. నష్టమంతా జరిగిపోయాక ప్రకటించే రుణమాఫీ కంటే, పంట ప్రారంభానికి ఇచ్చే పెట్టుబడే సమస్యకు సరైన చికిత్స అవుతుంది. వ్యవసాయం చేయాలన్న ఉత్సాహం, స్ఫూర్తి రైతులకు కలుగుతుంది. వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న అసలైన సమస్య సరైన సమయంలో పెట్టుబడి లేకపోవడమే. ఆ మూలాలను కేసీఆర్ అర్థం చేసుకున్నారని చెప్పొచ్చు. ఎక్కడా ఎలాంటి అవినీతికీ, చేతి వాటానికీ ఆస్కారం లేకుండా నూటికి నూరు శాతం ఈ పథకాన్ని అమలు చేయగలిగితే… దేశానికే తెలంగాణ ఆదర్శమౌతుంది. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరించే అవకాశం ఉంది.