కేసీఆర్ కి మరోసారి ఎందుకు ఓటెయ్యాలంటూ ప్రశ్నించారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కె. కోదండరామ్. హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ… గడచిన నాలుగేళ్లూ తెలంగాణలో నిరంకుశ పాలన సాగిందని విమర్శించారు. కేసీఆర్ నాలుగేళ్లలే ఏం చేశారని, ప్రజలు ఆయనకి ఓటెయ్యాలన్నారు. ప్రజా కూటమికి అనూహ్యంగా మద్దతు పెరుగుతోందనీ, ఎన్నికల తరువాత తామే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తరఫున నిలబడే ఒక కొత్త నాయకత్వం వస్తుందనీ, అందుకే తాము మహా కూటమిలో భాగస్వామ్యం అయ్యామన్నారు. అయితే, కూటమి ఏర్పాటు, సీట్ల పంపకాలు వంటి అంశాల్లో జాప్యం జరగడం వల్ల కొంత నష్టం జరుగుతున్న మాట వాస్తవమే అని కోదండరామ్ స్పష్టం చేశారు. కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఒక్కరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామనీ, స్నేహ పూర్వక పోటీలు లేకుండా చేస్తామని ఆయన చెప్పారు.
తాము ఓడిపోయేవాళ్లం కాదనీ, గరికగడ్డి లెక్క పీకేసిన కొద్దీ ఒక్క చుక్క వానపడితే లేచి వచ్చినట్టు పైకొస్తామన్నారు. తప్పనిసరిగా రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం తెచ్చి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. దానికి కావాల్సిన సామాజిక పరిస్థితులు కూడా ఇవాళ్ల పరిపక్వంగా ఉన్నాయని తాను గట్టిగా నమ్ముతున్నా అన్నారు. అజెండాను గెలిపించాలనేదే తమ తాపత్రయమనీ, ఎక్స్ గెలుస్తాడా వై గెలుస్తాడా అనే విధంగా వ్యక్తుల గెలుపు తనకు ముఖ్యం కాదన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది కూడా ముఖ్యం కాదన్నారు. ఈసారి ఎన్నికల్ల అజెండా గెలిస్తే చాలు.. అదే తమ విజయం అని భావిస్తున్నామన్నారు కోదండరామ్. ప్రజల కోసం నిలబడే ఒక కొత్త నాయకత్వం పెంపొందించాలనేది తమ ఆశయం అన్నారు.
ముఖ్యమంత్రి ఎవరనేది తమకు ముఖ్యం కాదని కోదండరామ్ ఈజీగా చెప్పేశారు! కానీ, ఈ మధ్య సీట్ల కేటాయింపుల సందర్భంగా ఆ చర్చ తెరమీద లేకుండా పోయింది. కాంగ్రెస్ లో ఎంతమంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్నారో తెలిసిందే కదా. ఇప్పుడు సీట్లు పంచాయితీలు కూడా దాదాపుగా అయిపోయాయి. ఒకవేళ మహా కూటమి మంచి ఫలితాలనే సాధించిందే అనుకోండి… అప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్న లొల్లి చాలా పెద్దదే అవుతుంది కదా!