మహా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశాన్ని చివరి వరకూ సాగదీస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. టీడీపీ, టీజేఎస్, సీపీఐ.. ఈ పార్టీల వాస్తవ బలాబలాలు కాంగ్రెస్ బాగా తెలుసు. పోనీ, కాంగ్రెస్ ప్రమేయం లేకుండా ఈ మూడు పార్టీలూ కలిసినా ఆ శక్తి ఎంతో కూడా వారికి తెలుసు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది మాత్రమే ఈ పార్టీలను కాంగ్రెస్ చేరదీసిన కీలకాంశం. అయితే, వీటిలో టీడీపీతో మొదట్నుంచీ ఎలాంటి ఇబ్బందిలేని పరిస్థితి కాంగ్రెస్ కి కలిసొచ్చిన తొలి అంశం అనొచ్చు. దాంతో మిగతా పార్టీలకు కేటాయించాల్సిన సీట్ల విషయమై వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. సీపీఐ ఎంత మొత్తుకున్నా మూడింటికే పరిమితం చేసింది. కొత్తగూడెం సీటు ఇవ్వమని భీష్మించి అదే మాట నెగ్గించుకుంది. ఇక, కోదండరామ్ పార్టీ టీజేఎస్ విషయంలోనూ కాంగ్రెస్ మైండ్ గేమ్ కనిపిస్తోంది.
ఎనిమిది సీట్లకు మొదట ఒప్పుకున్న కోదండరామ్… తూచ్, ఇప్పుడు 12 చోట్ల పోటీకి సిద్ధమన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ 12 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించలేదు. పోనీ, మొదటి ఒప్పందం ప్రకారం ఒప్పుకున్న 8 సీట్ల విషయానికొస్తే… ఓటమి సంఖ్యను తగ్గించుకోవాలన్న వ్యూహంలో ఆయా నియోజక వర్గాలను కోదండరామ్ పార్టీకి కాంగ్రెస్ వదిలినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ 8 స్థానాల ఎంపికలో కూడా కోదండరామ్ తడబడ్డారనే చెప్పొచ్చు. ఉదాహరణకు సిద్ధిపేట స్థానమే! అక్కడ హరీష్ రావు బలమైన అభ్యర్థి. ఇతర పార్టీల అభ్యర్థులకు ఆయన ముందు డిపాజిట్లూ అనుమానమే. ఆ స్థానాన్ని టీజీఎస్ తీసుకుంది. దుబ్బాకలో కూడా అదే పరిస్థితి. టీజేఎస్ ఎంచుకున్న సీట్లు వారికి బలమైనవిగానూ కనిపించడం లేదు, ఆ పార్టీ నిలబెట్టబోతున్న అభ్యర్థులైనా అంతటి బలవంతులుగా ఉన్నట్టు దాఖలాలు లేవు!
ఇక, కాంగ్రెస్ నుంచి చివరి లిస్టు కూడా వచ్చేస్తే… ఇప్పుడు పోటీ చేస్తామని కోదండరామ్ చెబుతున్నవి 12 అయినా… వాస్తవంగా కాంగ్రెస్ చూపించే ఖాళీ 8 సీట్లకే ఉండబోతోంది. అంటే, మిగిలిన ఆ స్థానాల్లోనే సర్దుకోవాల్సిన అనివార్యత కోదండరామ్ పార్టీకి ఏర్పడబోతోంది. మొత్తంగా గమనిస్తే… కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో కోదండరామ్ పడ్డట్టుగా కనిపిస్తోంది. ఇస్తామన్న 8 సీట్లు కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయమనుకునేవే ఎక్కువ. అలాగని, కూటమి నుంచి ఇప్పుడు బయటకి వెళ్లే పరిస్థితి కూడా టీజేఎస్ కి దాదాపు లేనట్టుగానే ఉంది. సీట్ల సర్దుబాటు విషయమై ముందుగానే ఒక ఒప్పందం ప్రకారం వ్యవహరించి, అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసుకుని ఉంటే.. టీజేఎస్ కి ఈ పరిస్థితి తప్పేది. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాస్త తెలివిగా కాంగ్రెస్ తో బేరాలు చేయలేకపోయారని చెప్పొచ్చు. కోదండరామ్ స్వతహాగా కాస్త నెమ్మదస్తుడు కావడం, పార్టీలో టిక్కెట్లు ఆశించేవారి నుంచి కూడా ఆయనపై ఒత్తిడి ఎక్కువగా ఉండటం వంటి అంతర్గత అంశాలు కూడా కాంగ్రెస్ కి ప్లస్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో అనూహ్యమైన పరిణామాలుంటే తప్ప… కూటమి నుంచి టీజేఎస్ బయటకి రాలేదు, కాంగ్రెస్ ను కాదని అభ్యర్థుల సంఖ్యను పెంచుకో లేదనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది.