తిరుమలలో తమ సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రజా ప్రతినిధులు లబోదిబోమంటున్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుమలలో అవే వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి దీనికి తెలంగాణ, ఏపీ అనే రాజకీయం చుట్టేశారు. తాజాగా మంత్రి కొండా సురేఖ శ్రీశైలం వెళ్లి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను కూడా తీసుకోవాలని వివక్ష చూపడం సరి కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలపై టీటీడీ నిశితంగా పరిశీలన చేస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తిరుమలలో ప్రజాప్రతినిధులందరి సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకూ నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తగ్గట్లుగా దర్శనాల ఏర్పాట్లు చేసేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారికి ఆ అవకాశం లేకుండాపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాంటి అవకాశం లేదు. కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం సహజంగానే రెడ్ కార్పెట్ వేశారు. అప్పుడు లోటు తెలియలేదు. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతూండటంతో సమస్యగా మారింది. కాంగ్రెస్ నేతల లేఖలకూ విలువ ఉండటం లేదు.
ఈ అంశంపై దృష్టి పెట్టిన టీటీడీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారంలో రెండు రోజులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అయితే నాలుగైదు రోజులు అయినా అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నట్లుగాచెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. రెండు రోజులో ఐదు రోజులో కానీ మొత్తానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు కొండపై పరిగణనలోకి తీసుకునే విధంగా మాత్రం నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.