తెలంగాణలో శాసన వ్యవస్థలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ లేకుండానే మండలి సమావేశం కాబోతోంది. ఈ నెల 27న ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ శాసనమండలి సమావేశమవుతోంది. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో శాసనమండలి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఏ చట్ట సభ అయినా ఆరు నెలల లోపు తప్పనిసరిగా సమావేశమవ్వాలి. ఆరు నెలల నిబంధన గడవు సెప్టెంబరు 28తో ముగుస్తున్నందున మండలి సమావేశమవుతోందని కౌన్సిల్ వర్గాలు చెప్తున్నాయి. ఈసారి అసెంబ్లీ రద్దు కావడంతో శాసనమండలి మాత్రమే సమావేశమవుతున్నది. చివరిగా మార్చి 28న మండలి సమావేశమైంది. ఎన్ని రోజుల పాటు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలనే అంశం మొదటి రోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఏదో ఫార్మాలిటీ కోసం కాబట్టి.. ఒకటి, రెండు రోజులు కన్నా ఎక్కువ నిర్వహించే అవకాశాల్లేవని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
సాధారణంగా అసెంబ్లీ,మండలి సమావేశాలు ఒకే సమయంలో జరుగుతుంటాయి..కానీ పార్టీలు ఎక్కువగా అసెంబ్లీ సమావేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి..అసెంబ్లీ రద్దు అయిన కారణంగా మండలి సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. చర్చ అంటూ జరిగితే.. టీఆర్ఎస్ రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మండలిలో టిఆర్ఎస్ బలం చాలా ఎక్కువగా ఉంది.బిజేపికి ఒక్కరు,కాంగ్రెస్ కు నలుగురు సభ్యుల బలం మాత్రమే ఉంది..మిగిలిన వారిలో ఇద్దరు ఎంఐఎం సభ్యులు.
ఎన్నికల ముందు జరుగుతన్న సమావేశం కావడంతో, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మండలి వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని భావిస్తున్నారని సమాచారం.ముందస్తు ఎన్నికలకు కారణాలను,అభివృద్ధి పథకాలను వివరించడంతో పాటు,కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ ఘాటుగా స్పందించే అవకాశాలున్నాయని టిఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అయితే ఇదో అసాధారణ పరిస్థితి. అసెంబ్లీ లేదు.. కానీ.. మండలి సమావేశం జరగాల్సిన పరిస్ధితి.