ఇప్పటితరాలకి పూర్తిగా తెలియని చరిత్ర ఇది. కొంతమంది తెలంగాణా వాసులకి కూడా పూర్తిగా ఈ తెలంగాణా చరిత్ర అవగాహన లేకపోవడానికి కారణం ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల స్కూల్ స్థాయిలో ఈ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చకపోవడం ఒక కారణమైతే, ఈ అంశం పై తెలంగాణ నాయకుల పరస్పర విరుద్ద వ్యాఖ్యలు కూడా ఒక కారణం. అయితే ఈ చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరముంది.
1947 ఆగస్ట్ 15 దేశం మొత్తం స్వతంత్ర పాలన లోకి వస్తే తెలంగాణ మాత్రం ఇంకా నిజాం పాలన లోనే ఉంది. బ్రిటిష్ వాళ్ళు దేశం వదిలేనాటికి 40% దేశం వేర్వేరు చిన్న రాజుల (ప్రిన్స్లీ స్టేట్స్) క్రింద ఉండేది. అయితే బ్రిటిష్ కింద ఉన్న ప్రాంతం తో పాటు మిగిలిన అన్ని సంస్థానాలని (మొత్తం 562 సంస్థానాలు) భారత్ లో విలీనం చేసే బాధ్యత ని అప్పటి హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నాడు. ఈ సంస్థానాధీశులకి స్వతంత్ర భారత్ లో, వారి సంస్థానాల ప్రాధాన్యతని బట్టి డిప్యూటీ కలెక్టర్, గవర్నర్ లాంటి పదవులు ఆఫర్ చేసాడు. వీటితో పాటు వారికి జీవితాంతం రాజభరణం గా ప్రతినెలా కొంత మొత్తం వస్తుందని చెప్పాడు. దానివల్ల ఆ 562 లో ఒక 3 తప్ప మిగిలిన సంస్థానాలన్నీ పటేల్ ఒప్పందానికి అంగీకరించి విలీనమయ్యాయి. ఉదాహరణకి రాం చరణ్ వైఫ్ ఉపాసన కామినేని వాళ్ళ తాత (ఆమె తండ్రి వైపు నుంచి) తన దొనకొండ సంస్థానాన్ని విలీనం చేసి డిప్యూటి కలెక్టర్ పదవి పొందాడు. అలాగే పెద్ద సంస్థానాల్ని విలీనం చేసిన “రాజ ప్రముఖులు” గవర్నర్ పదవులు పొందారు.
కానీ పటేల్ తో విభేదించి పోరాడిన రాజ్యాలు హైదరాబాద్ నిజాం, కాశ్మీర్ రాజు, జునాఘడ్ రాజు. హైదరాబాద్ నిజాం పాకిస్తాన్ తో కల్వడానికి లేదా స్వతంత్రంగా ఉండిపోవడానికి మొగ్గు చూపాడు. కాశ్మీర్, జునాఘడ్ లాంటి సరిహద్దు ప్రాంతాల కంటే హైదరాబాద్ లాంటి హింటర్ ల్యాండ్ (మధ్యస్థ భూభాగ ప్రాంతం) పాకిస్తాన్ లో కలవడం ప్రమాదమని భావించిన పటేల్ సైనిక చర్యకి పూనుకున్నాడు. నిజాం ప్రైవేటు సైన్యం అయిన “రజాకార్లు” దీన్ని ఎదిరించారు. ఖాసి రిజ్వీ నేతృత్వం లో ని ఈ రజాకార్లు తెలంగాణ ప్రజలపై చేసిన దురాగతాలు చరిత్రలో నెత్తుటి మరకల్లా మిగిలిపోయాయి.
దాదాపు ఏడాది పైగా అంటే 1947 ఆగస్ట్ 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు జరిగిన ఈ తతంగం సర్దార్ హోం మంత్రిగా, జరిగిన ఆపరేషన్ పోలో అని పిలవబడే సైనిక చర్య తో ముగిసింది. నిజాం లొంగిపోవలసి వచ్చింది. కొన్నాళ్ళ పాటు నిజాం ని లో జైల్లో ఉంచి ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి అనుమతిచ్చింది భారత్. ఈ సైనిక చర్యకి నేతృత్వం వహించిన జె.ఎస్. చౌదరి తెలాంగణ కి గవర్నర్ అయ్యాడు.
ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇది. కానీ దీన్ని అధికారికంగా నిర్వహిస్తే నిజాం ని అభిమానించే ముస్లిం ఓట్లు దూరమవుతాయన్న భయం తో ప్రభుత్వాలు దీన్ని నిర్వహించలేదు. అది దురదృష్టం అయితే, అంతకన్నా దురదృష్టం ఇది విమోచన కాదు విద్రోహం అని కొందరు నాయకులు మాట్లాడటం. విమోచన అన్న పదం నిజాం ని నెగటివ్ సెన్స్ లో చూపిస్తుంది కాబట్టి విలీనం అని పిలవాలని ఇంకొక వర్గం సూచన. ప్రతి ఏడూ, సెప్టంబర్ రాగానే దీని మీద కొంత రగడ చేయడం, ఆ తర్వాత మరిచి పోవడం మామూలైపోయింది.
ఏది ఏమైనా ఈ చరిత్ర ప్రతి తెలంగాణ వాళ్ళే కాదు, ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన అవసరముంది.