ఆంధ్రాలో పిచ్చి బ్రాండ్లు, అధిక ధరలతో మద్యం వ్యాపారం అంటే పేదల్ని పీల్చి పిప్పి చేయడమే అన్నట్లుగా మారింది. కాస్త స్థోమత ఉన్న వారెవరైనా మందు పార్టీ అంటే పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెడుతున్నారు. అందుకే… అదే పొరుగు రాష్ట్రంలో ఎందుకు మద్యం వ్యాపారం చేయకూడదని కూడా ఏపీ వ్యాపారులు ఫిక్సయ్యాయి. తెలంగాణ మద్యం దుకాణాలకు వేసిన లాటరీల్లో అత్యధికం ఆంధ్రా వాళ్లకే దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా జిల్లాల్లోనూ ఏపీ వ్యాపారులు…. దరఖాస్తులు కొని లాటరీల్లో పాల్గొని కొన్ని దుకాణాలు దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సారి విశాఖకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ రూ. వంద కోట్లుఖర్చు పెట్టి బల్క్ గా దుకాణాలకు దరఖాస్తులు సమర్పించిదని తెలంగాణ ఎక్సైజ్ వర్గాలు ప్రకటించాయి. ఆ కంపెనీ పేరు చెప్పలేదు. కానీ ఆ కంపెనీకి పది మద్యం దుకాణాలు వచ్చాయని చెబుతున్నారు . పది మద్యం దుకాణాలతో దరఖాస్తుల కోసం పెట్టిన వంద కోట్లు ఖర్చుతో పాటు లాభాలను కూడా రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ప్లాన్ ఉండబట్టే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారన్న అనుమానాలు ఉన్నాయి.
ఏపీ లో మద్యం పాలసీ తేడాగా ఉండటంతో.. వ్యాపారులు తెలంగాణ వైపు చూస్తున్నారు. మద్యం వ్యాపారంలో కిటుకులు వారికి తెలిసినట్లుగా ఇతరులకు తెలియవు. అందుకే దరఖాస్తు రెండు లక్షలు అయినా ఖర్చు పెట్టేశారు. దరఖాస్తుల డబ్బులు తిరిగి ఇవ్వరు. అందుకే… తెలంగాణ సర్కార్ కు రూ. 2,700 కోట్ల వరకూ దరఖాస్తుల ఆదాయమే వచ్చింది. అందులో సగానికిపైగా ఆంధ్రా వ్యాపారులదే అనుకోవచ్చు.
వీరి జోరు ఇలా కొనసాగితే.. ఈ సారి తెలంగాణ వారికి మాత్రమే అనే కోటాను అక్కడి ప్రభుత్వం తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.