నలభై రోజుల తర్వాత మద్యం అందుబాటులోకి రావడంతో తెలంగాణలో మందు బాబులు కిలోమీటర్ల మేర లైన్లలో నిల్చుని అయినా.. తమ కోటా మద్యం అందుకున్నారు. ధరలు పదహారు శాతం పెంచినా.. ఎవరూ అసంతృప్తికి గురి కాలేదు. ముందుగా.. తమకు ఓ బాటిల్ చేతిలోకి రావాలనే తాపత్రయ పడ్డారు. ఇలా మొత్తం.. ఒక రోజులో రూ. 45 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లుగా తెలుస్తోంది. అది రికార్డులు బద్దలయ్యో మొత్తం కాదు. సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలు రూ. 40కోట్ల మేర ఉంటారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అంటే.. కొద్దిగా మాత్రమే ఎక్కువ. పలు చోట్ల స్టాక్ అయిపోవడం.. కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో…ఆ ప్రభావం అమ్మకాల మొత్తంపై పడిందని భావిస్తున్నారు.
స్టాక్ విషయంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ… రెండు రోజుల ముందు నుంచే దృష్టి పెట్టింది. వెంటనే ఉత్పత్తికి అనుమతి ఇవ్వడంతో పాటు డిపోల్లో ఉన్న వాటిని దుకాణాలకు శరవేగంగా తరలించింది. దీంతో… రెండో రోజు నుంచి అన్ని బ్రాండ్లు… అందుబాటులో ఉంటాయని… చెబుతున్నారు. దీంతో రెండో రోజూ… మద్యం దుకాణాల వద్ద పెద్ద క్యూలు కనిపించే అవకాశం ఉంది. మద్యం డిమాండ్ అసాధారణంగా ఏమీ లేదని… 40 రోజుల పాటు అందుబాటులో లేనందున.. మద్యానికి అలవాటు పడిన వారు కొనుగోలు చేస్తున్నారని… రెండు రోజుల తర్వాత సాధారణ పరిస్థితి వస్తుందని అధికారులు అంటున్నారు.
తొలి రోజు మద్యం దుకాణాల వద్ద.. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా కనిపించారు. జూబ్లిహిల్స్‌లో సంపన్నులు మద్యం కొనుగోలు చేసే టానిక్ అనే సూపర్ స్టోర్‌లో ఎక్కువగా హైఫై యువతులే కనిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్లుకు అలవాటు పడిన మహిళలు కూడా… మద్యం కోసం క్యూల్లో నిలబడటం కనిపించింది. పొరుగు రాష్ట్రాల్లో 75శాతం ధరలు పెంచడంతో.. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంటుందేమోనని.. మందుబాబులు భయపడ్డారు.