తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు…? నెలలు గడుస్తున్నా కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారు…? నవంబర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పినా ఆలస్యం కాబోతుందా…?
అవును. ఆలస్యం కాబోతుంది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ-జెడ్పీటీసీల నిర్వహణ పెండింగ్ లోనే ఉంది. నవంబర్ లో సర్పంచ్ ల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మొదట ఆలోచించింది. కానీ, ఇప్పుడు అది కూడా వాయిదా పడబోతుంది.
రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో కొత్త ఓటర్ లిస్టును ప్రచురించాల్సి ఉంది. కొత్త ఓటర్ లిస్టు కోసం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియ మొదలు పెట్టినా, కుల గణనకు కనీసం మూడు నెలల సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. కులగణన అయితే తప్పా రిజర్వేషన్లు ఖరారు చేయలేరు. దీంతో మూడు నెలల కాల పరిమితి కులగణనకే పోతే ఆ తర్వాత రిజర్వేషన్లతో పాటు మిగతా ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం నెలన్నర పడుతుంది.
అంటే… సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎలా చూసిన వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే జరిగే అవకాశాలున్నాయి. అప్పటి లోపు ప్రభుత్వం రైతుభరోసా నిధులతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ పూర్తికాక, రైతు భరోసా నిధులు ఇవ్వక కొంతమేర అసంతృప్తి మొదలైంది. వీటికి తోడు స్థానికంగా గతంలో మొదలైన అభివృద్ది పనులు పూర్తి చేస్తే తప్పా కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. దీంతో ఇటు రిజర్వేషన్లు, అటు పెండింగ్ పనులు పూర్తి చేసిన తర్వాతే సర్కార్ పంచాయితీ ఎన్నికలకు వెళ్లబోతుంది.