ఎట్టకేలకు అభ్యర్థుల నామినేషన్లు, ఉపసంహరణ పర్వం కూడా ముగిసింది. ఈ క్రమంలో మహా కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత ఉంటుందా… ఉమ్మడి లక్ష్యానికి అనుగుణంగా వీరంతా కసిలిమెలిసి ఎన్నికల బరిలో నిలుస్తారా అనే అనుమానాలు ప్రతీ దశలోనూ వ్యక్తమౌతూనే వస్తున్నాయి. అయితే, పార్టీల మధ్య అసంతృప్తులు ఎలా ఉన్నా, టిక్కెట్ల కేటాయింపుల్లో కొన్ని ఇబ్బందులున్నా… తామంతా కలిసి తెరాసను ఐక్యంగా ఎదుర్కొంటామనే నిశ్చితాభిప్రాయానికే కట్టుబడి ఉండటం గమనార్హం. ఓరకంగా చెప్పాలంటే.. కాంగ్రెస్ తీరుపై కోదండరామ్ కు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ, చూసీచూడనట్టుగా కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.
రెబెల్స్ సంఖ్యను తగ్గించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా తమవంతు శక్తివంచన లేకుండానే ప్రయత్నించిందనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కూటమి పార్టీలకు ఇచ్చిన స్థానాల్లో రెబెల్స్ గా బరిలోకి దిగినవారితో నామినేషన్లను ఉపసంహరింపజేయడం కోసం నేతలు బాగానే తిప్పలు పడ్డారు. బుజ్జగింపుల్లో హైలైట్ ఏంటంటే… శేర్లింగంపల్లి నుంచి భిక్షపతి యాదవ్ ను వెనక్కి తగ్గించడం. పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి దక్కింది. దీంతో అసంతృప్తికి గురైన కాంగ్రెస్ నేత భిక్షపతి… స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన్ని బుజ్జగించడం కోసం ఢిల్లీ నుంచి అహ్మద్ పటేల్, జైరామ్ రమేష్ లు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ నచ్చజెప్పారు. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇక, మేడ్చల్, సికింద్రాబాద్ వంటి స్థానాల్లో ఎదురైన రెబెల్స్ ఇబ్బందిని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థాయిలోనే చర్చలు జరిపి, అసంతృప్త నేతల్ని ఒప్పించగలిగారు. ఇక, ఇబ్రహీపట్నం సీటు విషయానికొస్తే.. టీడీపీ అభ్యర్థి సామా రంగారెడ్డి నామినేషన్ వేశారు. కానీ, కాంగ్రెస్ కి చెందిన మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ నుంచి నామినేషన్ వేశారు. అయితే, ఆయనతో నామినేషన్ ను విత్ డ్రా చేయించే ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు. వరంగల్ వెస్ట్ లో కాంగ్రెస్ ముఖ్య నాయకుడు నాయిని రాజేందర్ రెడ్డితో కూడా చర్చలు జరిపి, ఆయన్ని బుజ్జగించగలిగారు. పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీలో ఉన్నారు.
కూటమి పార్టీలైన టీడీపీ, టీజేయస్ లు కూడా రెబెల్స్ తో విత్ డ్రాలు చేయించడం తమవంతు ప్రయత్నం గట్టిగానే చేశారు. నిజానికి, టీడీపీలో అసంతృప్తుల్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించారు. దీంతో ఆ పార్టీలోని అసంతృప్తులు పెద్దగా లేని పరిస్థితే కనిపిస్తోంది. ఈ టీజేయస్ కొంత ఇబ్బందిపడ్డా… చివరికి కోదండరామ్ కూడా కొంత రాజీపడి, సొంత నేతల్ని కొంత బుజ్జగించి… మొత్తానికి అక్కడా అసంతృప్తులు దాదాపు తగ్గిపోయిన పరిస్థితే కనిపిస్తోంది. మహా కూటమిలోని పార్టీల ఐక్యత అనేది ఎప్పటికప్పుడు ప్రశ్నగా కనిపిస్తూనే వస్తున్నా… చివరికి వచ్చేసరికి తెరాసను ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతో అందరూ పోరాటానికి సిద్ధమైన పరిస్థితి వచ్చిందనే చెప్పొచ్చు.