తెలంగాణ మెడిసిన్, డెంటల్ విద్యార్థులకు క్షణక్షణం టెన్షన్ గా మారింది. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ నిజమేనని సి ఐ డి అధికారులు తేల్చారు. ముగ్గురిని అరెస్టుచేశారు. దీంతో పరీక్ష రద్దుకు రంగం సిద్ధమైందని వార్తలు వచ్చాయి.
మెడిసిన్ విద్యార్థులు ఇప్పటికే మూడుసార్లు ఎంట్రన్స్ పరీక్షలు రాశారు. ఇంటర్ పరీక్షలు అయిపోగానే ఎంసెట్ కు ప్రిపేర్ అయ్యారు. అయితే ఇంతలో నీట్ వ్యహారం తెరపైకి వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో నీట్ తప్పనిసరి కావడంతో ఆ పరీక్ష రాశారు. ఆ తర్వాతి పరిణామాల్లో ఈ ఏడాదికి నీట్ నుంచి మినహాయింపు లభించింది. దీంతో ఎంసెట్ 2 రాసే అవకాశం వచ్చింది.
ఇవన్నీ జరిగేసరికి విద్యార్థులు మానసికంగా ఎంతో ఒత్తిడి అనుభవించారు. ఎంసెట్ రాసినా, అఖిల భారత మెడికల్ కళాశాలల్లో సీటు కావాలంటే నీట్ తప్పనిసరి. ఇప్పుడు ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ నిజమేనని సి ఐ డి ధ్రువీకరించింది. కాబట్టి పరీక్షను రద్దు చేయడమే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఐదు నెలల్లో మూడు సార్లు ఎంట్రన్స్ పరీక్షలు రాశారు. ఇప్పుడు మరోసారి రాయాలా అని విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.
సిఐడి దర్యాప్తులో తేలినదాని ప్రకారం కనీసం 69 మంది ఈ లీకేజీ వల్ల లబ్ధి పొందారు. కాబట్టి వాళ్ల ర్యాంకులను రద్దు చేస్తే సరిపోతుంది అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. బుధవారం కొందరు తల్లిదండ్రులు వైద్యశాఖ మంత్రిని కలిశారు. పరీక్ష రద్దు చేయవద్దని కోరారు. ప్రభుత్వం మాత్రం, ఇంత జరిగిన తర్వాత పరీక్ష రద్దు చేయకపోతే విమర్శలు వస్తాయేమోనని భావిస్తోంది. సోమవారం మొదలు కావాల్సిన కౌన్సెలింగ్ ను వాయిదా వేసింది. ఒకవేళ పరీక్ష రద్దయితే మరికొన్ని రోజుల్లో ముచ్చటగా మూడోసారి ఎంసెట్ రాయాల్సి వస్తుంది.
అసలే మెడిసిన్ సీట్లు తక్కువ. అందుకే ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే మెడిసన్ విద్యార్థులకు పోటీ ఎక్కువ. ఒత్తిడి ఎక్కువ. దానికి తోడు ఇలా పదే పదే పరీక్షలు రాయడం అగ్నిపరీక్షగా మారింది. ఇన్ని బాధలు పడేకంటే ఏదో ఒక డిగ్రీలో చేరిపోదాం అనుకునే వాళ్లూ ఉన్నారు. మొత్తానికి ఈసారి మెడిసిన్ ఆశావహులకు అంతా పరీక్షా కాలంగా మారింది.