ఆంధ్రాలో రాజధానుల అంశమై తెలంగాణ ముఖ్యమంత్రిగానీ, మంత్రి కేటీఆర్ గానీ ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. జగన్ సర్కారునున మెచ్చుకోలేదు, గత టీడీపీ సర్కారును విమర్శించనూ లేదు. అది ఏపీ అంతర్గత వ్యవహారమనీ, దానిపై తన అభిప్రాయం తెలియజేయడం సరికాదంటూ మొన్ననే మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ రాజధానుల అంశమై స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిను విమర్శించేందుకు ఇదో అవకాశంగా మార్చుకున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఏలూరు ప్రాంతంలో కోడి పందాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజధాని అంశమై శాశ్వత పరిష్కారం ఉండాలన్నారు. ఇక్కడ రాజధాని మీద కొంత ఆందోళన ఉందనీ, ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇది పరిష్కారమౌతుందన్నారు. ప్రజలందరూ ఆనందంగానే ఉన్నారనీ, ఒక్క బిక్షమెత్తుకునేవాళ్లే తప్ప అని విమర్శించారు. అమరావతి రైతులు ఇబ్బందిపడాల్సిన పనిలేదనీ, మీకు డైనమిక్ సీఎం ఉన్నారనీ, మీ ఆశలు మంచి వాతావరణంలో నెరవేరుతాయన్నారు. అంతేగానీ, ఈ బిక్షాటన చేసేవాళ్లతో ఏం జరగదనీ, వాళ్లను నమ్ముకోవద్దనీ, గతంలో ఎలాగైతే వారు మునిగారో మళ్లీ మునుగుతారనీ, ఆయన్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టి గోదారి ఈదినట్టే ఉంటుందంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజధాని అనేది ఆంధ్రా ప్రజలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశమనీ, ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదన్నారు.
ఏపీలో రాజధానుల అంశమై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఇంకా తమ ద్రుష్టికి ఆ అంశం రాలేదనీ, అది రాష్ట్ర వ్యవహారమనీ హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా చాలాసార్లు ప్రకటనలు చేశారు. దీనిపై తలసాని తన అభిప్రాయం ఇదీ అని తెలియజేయడంలో తప్పులేదు. కానీ, ఇది వేరే రాష్ట్ర అంశమ్మీద మాట్లాడకూడదు అంటూనే… చంద్రబాబు వెంట వెళ్లొద్దనీ, ఆయన్ని నమ్మొద్దని విమర్శించాల్సిన పనేముంది? అమరావతి రైతులకు కూడా ఈయన భరోసా ఇవ్వాల్సిన అవసరమూ లేదు కదా? మంత్రి కేటీఆర్ మాదిరిగా… నేను మాట్లాడటం సరికాదని ఈ ప్రశ్నను దాటెయ్యొచ్చు కదా?