తెరాస అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణాకి 300 మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. మార్కెట్ ధర కంటే కాస్త తగ్గించే తెలంగాణాకి విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అప్పట్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండటంతో తెలంగాణా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆ ఆఫర్ ని పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత పరిస్థితులు కొంచెం చక్కబడటంతో ఏపి నుంచి విద్యుత్ కొనుగోలుకి తెలంగాణా ప్రభుత్వం సిద్దమయింది. ఏపి ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది. కృష్ణపట్నం నుంచి 300 మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మాట చెప్పి ఇప్పటికి చాలా రోజులే అయ్యింది. కానీ ఇంతవరకు విద్యుత్ సరఫరాకి కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు. అలాగని విద్యుత్ ఇవ్వబోమని చెప్పడం లేదు.
ఏపి ప్రభుత్వం తమతో ఈవిధంగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్ధం కావడం లేదని తెలంగాణా విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడి విద్యుత్ అత్యవసరం అయిన ఈ సమయంలో ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తారని, ఇచ్చినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణాలో తెదేపా నేతలు దీనిపై ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు తనకి రెండు కళ్ళవంటివని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణాకి విద్యుత్ సరఫరా చేస్తామని స్వయంగా హామీ ఇచ్చి ఉన్నప్పుడు, మళ్ళీ దానిపై ఎందుకు వెనుకంజ వేయడం అనుమానాలకు, అపార్ధాలకు దారి తీస్తుంది. ఒకవేళ తెలంగాణాకి విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితులే ఉన్నట్లయితే, అదే విషయం స్పష్టంగా చెప్పేయడం మంచిది కదా?లేకుంటే ఇప్పుడు తెలంగాణాపై ఆయనకి ఆసక్తి, తెదేపాకి పట్టు కోల్పోయింది కనుకనే ఆవిధంగా చేస్తున్నారని ప్రచారం మొదలవుతుంది.