అందరూ ఒక్కసారిగా బిజీ అయిపోయారు! ఒకరేమో పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడుతుంటే, మరొకరేమో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు! ఒకరేమో ఆసుపత్రుల్లో సౌకర్యాలపై దృష్టిపెట్టి పర్యటిస్తుంటే, మరొకరేమో దేవాలయాల్లో సదుపాయాలను మెరుగు చేసే పనుల్లోపడ్డారు. తెలంగాణ మంత్రులంతా ఇప్పుడు బిజీబిజీగా జిల్లాల్లో గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా… గతవారం రోజులుగా చూసుకుంటే వారి హడావుడి మరింతగా కనిపిస్తోంది.
మెదక్ జిల్లాలో పర్యటించి మంత్రి హరీష్ రావు… తూఫ్రాన్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల కోసం ప్రభుత్వం చెయ్యాల్సినంతా చేస్తోందనీ, వీరంతా భవిష్యత్తులో ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంత్రి ఈటెల రాజేందర్… హైదరాబాద్ నేచర్ క్యూర్ లో ఓపీ సేవలు ప్రారంభిస్తామన్నారు. సంప్రదాయ వైద్యానికి పునర్వైభవం తీసుకొస్తామన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్… ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగింపు సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు కదా… మంత్రులూ ఎమ్మెల్యేలూ నెలకి ఒకసారైనా ఆర్టీసీలో ప్రయాణించాలని! దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఆర్టీసీలో సరుకుల రవాణా త్వరలో ప్రారంభిస్తామనీ, లాభాల బాటలో సంస్థను నడిపించాలన్న సదుద్దేశంతో ఉన్నామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు… ఖమ్మం, మెహబుబాబాద్ జిల్లాల్లో పర్యటించారు. మెహబుబాబాద్ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, సౌకర్యాలను పరిశీలించారు. పరిశుభ్రత బాగులేదని ఆగ్రహించి, కాంట్రాక్టరును అప్పటికప్పుడే తొలగిస్తున్నట్టు ఆదేశించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మంత్రి సబితారెడ్డి, మంత్రి మల్లారెడ్డి పర్యటించి మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉన్నట్టుండి మంత్రులంతా ఇలా ఒకేసారి జిల్లాల బాట పట్టేసి, ప్రజల్లోకి దూకుడుగా వెళ్తున్నారేంటి..? రెండు కారణాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కారు రెండో దఫాకి ఏడాది పూర్తయింది. ఏడాది గడుస్తున్నా చేసిందేం లేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ ఏడాదిలో ఏం సాధించారో చెప్పుకునేందుకు మంత్రుల దగ్గరా ప్రత్యేకంగా కంటెంట్ ఏం లేదు! అలాంటి చర్చ ప్రజల్లో రాకుండా ఉండాలంటే, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శించకుండా ఉండాలంటే… నేతలు జనంలో ఉండాలి, ఉంటున్నారు. ఇక, రెండో కారణం… త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. చేసినవి చెప్పుకోవాలి, లేదా చేయబోయేవి చెప్పాలి. ఇప్పుడు మంత్రులంతా జిల్లాల పేరుతో చేస్తున్నది ఇదే ప్రయత్నం.