తెలంగాణా రాష్ట్ర భాజపా అద్వర్యంలో నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిన్న జరిగిన వికాస్ పర్వ్ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ ఈ రెండేళ్లలో కేంద్రప్రభుత్వం వివిధ పద్దుల క్రింద మొత్తం రూ.90,000 కోట్లు తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చిందని చెప్పారు. కేంద్రప్రభుత్వం సహకారం వలననే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని చెప్పారు. కేంద్రప్రభుత్వం తెలంగాణాకి నిరంతర విద్యుత్ అందిస్తోందని, మారుమూల గ్రామీణ ప్రాంతాలకి కూడా రోడ్లు నిర్మించేందుకు నిధులు విడుదల చేస్తోందని చెప్పారు. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా అది గ్రామస్థాయి వరకు చేరడం లేదని ఆరోపించారు.
ఆయన చెప్పిన మాటలను తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, నీతిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఖండించారు.
గత రెండేళ్లలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అన్నిటికీ కలిపి కేవలం రూ.36000 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఈటెల చెప్పారు. కానీ అమిత్ షా రూ.90,000 కోట్లు ఇచ్చామని చెప్పడం తప్పని అన్నారు. ఆయన వంటి జాతీయస్థాయి నాయకుడు ఈవిధంగా అబద్ధాలు చెప్పడం సబబు కాదని అన్నారు.
“ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుని, రాష్ట్రం అభివృద్ధిని మెచ్చుకొంటుంటే అమిత్ షా ఆవిధంగా మాట్లాడటం చాలా చిత్రంగా ఉంది. అసలు కేంద్రప్రభుత్వం తెలంగాణాకి ఏమీ చేయకుండానే, చాలా చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని బొత్తిగా పట్టించుకోకపోయినా మా సమస్యలన్నిటినీ మేమే పరిష్కరించుకొంటూ ముందుకు సాగుతున్నాము. రెండేళ్లలో తెలంగాణా సాధించిన స్వయంసంవ్రుద్ధికి కేంద్రం చేసిందేమీ లేదు. అయినా గొప్పలు చెప్పుకొంటోంది,” అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ.1.40 లక్షల కోట్లు మంజూరు చేశామని అమిత్ షా రాజమండ్రి సభలో ప్రకటించినప్పటి నుండి రాష్ట్ర భాజపా నేతలు కూడా అదే పాట పాడుతున్నారు. కానీ అందులో సగం కూడా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలకి ఎక్కడా పొంతన కనబడటం లేదు. వారి వాదనల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో వేల కోట్లు లెక్కల తేడాలు కనిపిస్తున్నాయి. కేంద్రం అంత డబ్బు ఇవ్వడం నిజమైతే ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇవ్వకపోయుంటే అమిత్ షా ఎందుకు అబద్ధాలు చెప్పుకొంటున్నారనే సందేహం కలుగుతుంది.
ఒకవేళ కేంద్రప్రభుత్వం నిజంగా అన్ని వేల కోట్లు ఇస్తున్నా కూడా ఆ క్రెడిట్ దానికి దక్కే అవకాశం ఏమాత్రం ఉండదు. అది ఇస్తున్న నిధులతో ఏపిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత పదకాలుగా ప్రచారం చేసుకొంటున్నారని రాష్ట్ర భాజపా నేతలు నిత్యం ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. కనుక ఆ లెక్కలు చెప్పడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడం వృధా ప్రయాసేనని చెప్పవచ్చు. భాజపా బలపడాలంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్నిర్మించుకొని నిత్యం ప్రజలలో ఉండే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కానీ రెండు రాష్ట్రాలలో భాజపా నేతలు అప్పుడప్పుడు మాత్రమే ప్రజలకు కనిపిస్తుంటారు. కనీసం తమ పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కనబడరు. అటువంటప్పుడు ఎన్ని లెక్కలు అప్పజెప్పినా ఏమి ప్రయోజనం?