తెలంగాణ శాసనసభ సమావేశాల తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన పై దృష్టి సారించనున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. మంత్రివర్గంలో ఎవరి పనితీరు ఎలా ఉంది అని అంచనా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తన క్యాబినెట్ లోని మంత్రుల పనితీరు పై నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రుల పనితీరు అంచనా వేసేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్సీ విభాగాన్ని కాకుండా ఓ ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై పూర్తి సమాచారాన్ని రాబడుతున్నారు. ఈ నివేదిక ఆధారంగా తన క్యాబినెట్ సహచరులకు ముఖ్యమంత్రి ర్యాంకులు ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రుల పనితీరును ఏ, బీ,సీలుగా విభజించి ఆ నివేదికలను మంత్రులకు అందజేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నివేదిక అందజేసే వరకు మంత్రుల పనితీరు పై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను కూడా పొందు పరచనున్నారు. తాను ఉద్వాసన పలకాలని అనుకుంటున్న మంత్రుల పనితీరుపై నివేదిక ద్వారానే ఎందుకు తొలగించాల్సి వచ్చిందో తెలియజేస్తారని అంటున్నారు. అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న ఈ సర్వేకు సంబంధించిన సమాచారం ఐటీ శాఖ మంత్రి, తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు తప్ప వేరే ఎవరికీ తెలియకూడదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వే చేస్తున్న సంస్థను ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాటు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలకున్న వారి గురించి కూడా ఆరా తీయాలని సీఎం సర్వే చేస్తున్న సంస్థను ఆదేశించినట్లు చెబుతున్నారు.