తెలంగాణ రాజకీయ నేతలపై బెంగళూరు పోలీసులు మీడియాకు ఇస్తున్న లీకులపై తెలంగాణ రాజకీయ నేతల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుమానిస్తున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్న బీజేపీనే …. డ్రగ్స్ పేరుతో దొరికిన ఓ తీగను.. తెలంగాణ వైపు మళ్లించి రాజకీయంగా గేమ్ ప్రారంభించిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల కోసమే .. ఎక్కువగా మీడియాలో లీకులు ఇచ్చి.. అందులో పేర్లున్న వారిపై రకరకాల ప్రచారాలు చేస్తారు. వారిని ఒత్తిడికి గురి చేస్తారు. వారు టార్గెట్ చేసిన పార్టీపై విమర్శలు గుప్పిస్తారు. చివరికి అలాంటి నేతలు..బీజేపీలో చేరితే అంతా సైలెంటయిపోతుంది. బెంగాల్లో శారదా స్కాంలో అదే వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు… తెలంగాణలో డ్రగ్స్ కేసును అలా వాడుకుంటున్నారా అన్న చర్చ ప్రారంభమయింది.
తెలంగాణలో టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ కేసులో ఉన్నారని కొద్ది రోజుల కిందట.. తెలుగు మీడియాకు బెంగళూరు పోలీసులు లీక్ చేశారు. కానీ ఎవరి పేర్లూ చెప్పలేదు. ఓ యువ ఎమ్మెల్యే.. మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎమ్మెల్యే… మరో విద్యా సంస్థల అధినేత ఇలాంటి లీకులు ఇచ్చి.. మొత్తానికి వారెవరో అందరికీ తెలిసేలా ప్రచారం చేశారు. నేడో రేపో నోటీసులంటూ హంగామా చేశారు. కానీ .. సైలెంటయ్యారు. మళ్లీ కొత్తగా ఇంకా చాలా మంది ఉన్నారంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు పోలీసులు తెలుగు మీడియాకు ఇంటర్యూలు కూడా ఇస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. తమ పార్టీ టార్గెట్గా డ్రగ్స్ కేసును ఉపయోగించుకుని ఏదో చేయబోతున్నారన్న అనుమానాలు ఆ పార్టీలో ప్రారంభమయ్యాయి.
భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో బలపడాలంటే వాటికి ఎక్కువగా సాయం చేసింది.. దర్యాప్తు సంస్థలే. రాజకీయ నేతలన్న తర్వాత… వారి వెనుక లూప్ హోల్స్ ఉండకుండా ఉండవు. వాటిని పట్టుకుని అందర్నీ బీజేపీలో చేర్పించే పనిలో చాలా కాలంగా దర్యాప్తు సంస్థలు చురుకుగా వ్యవహరిస్తున్నాయన్నది తెర ముందున్న రహస్యమే. అలాంటి ప్లాన్లే.. ఇప్పుడు తెలంగాణలో అమలు చేస్తున్నారా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. డ్రగ్స్ కేసు సీరియస్ ఇష్యూ కాబట్టి.. ఎవరైనా అందులో అనుమానితులు బీజేపీలో చేరితే మాత్రం… గేమ్ ప్రారంభమయినట్లుగానే భావించాల్సి ఉంటుందంటున్నారు.