తెలంగాణలో జరగనున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. రెండు రోజుల కిందట వరకూ విజయశాంతి పేరు పరిశీలనలో లేదు. ఆమె రాష్ట్ర నేతలు ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదు. నేరుగా హైకమాండ్ పెద్దలతో భేటీ అయ్యారు. తన పేరు ప్రకటించుకునేలా చేసుకున్నారు.
అద్దంకి దయాకర్ పేరును ఖరారు చేయడం వెనుక రేవంత్ పట్టుదల ఉందని అనుకోవచ్చు.. ఆయనకు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు కేటాయించలేకపోయారు. చాలా సార్లు అవకాశాలు వచ్చినా ఇవ్వలేకపోయారు. నల్లగొండ కీలక నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడమే కారణం. ఎట్టకేలకు వారితో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్న అద్దంకి దయాకర్ ఎస్సీ కోటాలో తనకు అవకాశం ఇప్పించుకోగలిగారు. ఎస్టీ వర్గానికి శంకర్ నాయక్ కు అవకాశం కల్పించారు. మరో సీటును సీపీఐకి కేటాయించారు. బీఆర్ఎస్ పార్టీకి ఒకటి లభిస్తుంది.
విజయశాంతి ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కానీ ఆమెతో ప్రచారం కూడా చేయించుకోలేదు. చాలా కాలంగా రాజకీయ కార్యక్రమాల్లో లేరు. అప్పుడప్పుడూ ట్వీట్లు పెడుతూంటారు. అయితే హైకమండ్ వద్ద ఉన్న పలుకుబడి కారణంగా అవకాశం దక్కించుకున్నారు.