తెలంగాణలో రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల కౌంటింగ్ ఇలా మొదలుపెట్టగానే మధ్యాహ్నం లోపు ఎన్నికల ఫలితాలు తేలిపోయే ఈవీఎం కౌంటింగ్ చూసిన ప్రస్తుత తరానికి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రోజుల తరబడి కొనసాగడం పజిల్ గా మారింది. కౌంటింగ్ కు ఇంత సమయం ఎందుకు పడుతోందని కొంత మంది తర్కించుకుంటున్నారు కూడా. అయితే ఎందుకిలా జరుగుతుందన్నది అర్థం కావాలంటే అసలు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం రాజ్యాంగం ఏర్పాటు చేసిన విధానం తెలుసుకోవాలి. వివరాల్లోకి వెళితే..
నాలుగు రోజులైనా తేలని ఫలితం:
మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ప్రాంతాలకు కలిపి ఒక ఎమ్మెల్సీ స్థానం, నల్గొండ వరంగల్ ఖమ్మం ప్రాంతాలకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నందున ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో అభ్యర్ధులు పోటీ పడ్డారు. 2 స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు 17వ తేదీ ఉదయం మొదలైంది. అయితే దాదాపు నాలుగు రోజులు అయినప్పటికీ తుది ఫలితాలు వెలువడలేదు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి, బిజెపి అభ్యర్థి రామచంద్ర రావు మధ్య పోటీ కొనసాగుతోంది. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మూడవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఖమ్మం ప్రాంత ఎమ్మెల్సీ ఎన్నికలు టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ మొదటి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ మూడవ స్థానంలో బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారు. అయితే తుది ఫలితాలు రావడానికి కి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
Preferential voting పద్ధతిలో ఓటింగ్, Transferable vote పద్ధతిలో కౌంటింగ్:
సాధారణ ఎన్నికలలో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తారు. కానీ ప్రిఫరెన్షియల్ వోటింగ్ పద్ధతిలో ప్రతి ఓటరు కూడా తన మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి, రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి, మూడవ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇలా తన ప్రాధాన్యతలు ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఒకవేళ తనకు రెండవ మూడవ తదితర ప్రాధాన్యతలు లేనట్లయితే కేవలం మొదటి ప్రాధాన్యత మాత్రమే కూడా ఓటరు ఇవ్వవచ్చు.
ఓటింగ్ లో మాత్రమే కాకుండా కౌంటింగ్ లో కూడా ఇక్కడ విభిన్నమైన పద్ధతిని అవలంభిస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు తీసివేయగా మిగిలిన మొత్తం ఓట్లలో 50% కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులు మాత్రమే విజేతగా నిలబడతాడు. ఉదాహరణకు హైదరాబాద్ ప్రాంతంలో 5.2 లక్షల ఓటర్లు ఉండగా, అందులో చెల్లని ఓట్లు తీసివేయగా సుమారు మూడు లక్షల ఓట్లు ఉన్నాయనుకుంటే, ఏ అభ్యర్థి 50 శాతం కంటే ఎక్కువగా- అంటే కనీసం 1,50,001 ఓట్లు సాధిస్తారో వారే విజేత అవుతారు. ఇలా సాధించవలసిన ఓట్ల సంఖ్య ని కోటా అంటారు. చెల్లని ఓట్లు తీసివేయగా మిగిలిన ఓట్లలో 50 శాతం ప్లస్ 1 ఓటు- కోటా అవుతుంది.
మొదటిగా ఒక్కొక్క ఓటు లో మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి అయిన కోటా సంఖ్య ఓట్లను సాధిస్తే విజేతగా ప్రకటింప పడతాడు. అలా సాధించలేకపోతే ట్రాన్స్ఫరబుల్ ఓట్ పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఉదాహరణకు ప్రస్తుత ఎన్నికలలో హైదరాబాద్ స్థానంలో వాణి దేవి మొదటి ప్రాధాన్యత ఓట్ల లో అందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించినప్పటికీ, ఆవిడకు కోటా సంఖ్య కావలసిన ఓట్లు లభించలేదు. ఇలాంటి సందర్భంలో కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది అంటే..పోటీ చేసిన అభ్యర్థులు అందరిలోకి అందరి కంటే తక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థి ని పోటీ నుండి ఎలిమినేట్ చేస్తారు. ఆ అభ్యర్థికి పడ్డ ఓట్లు అన్నింటిలో రెండవ ప్రిఫరెన్స్ ఎవరికి ఉన్నాయో ఆ అభ్యర్థులకు ఈ ఓట్లను కలుపుతారు. ఉదాహరణకు 90 కి పైగా అభ్యర్థులు పోటీ చేసిన హైదరాబాద్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లో చివరగా నిలిచిన అభ్యర్థికి వెయ్యి ఓట్లు వచ్చాయి అనుకుందాం. అప్పుడు ఆ చివరి స్థానంలో వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆ వెయ్యి ఓట్ల లో రెండవ ప్రిఫరెన్స్ ఎవరికీ వచ్చాయో చూస్తారు. ఉదాహరణకు ఆ 1000 ఓట్లలో 500 ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి రెండవ ప్రాధాన్యత ఓట్లు, 300 మంది బిజెపికి రెండవ ప్రాధాన్యత ఓట్లు, 200 మంది కాంగ్రెస్ అభ్యర్థికి రెండవ ప్రాధాన్యత ఓటు వేశారు అనుకుందాం. ఇప్పుడు ఆ 500 ఓట్లు టిఆర్ఎస్ అభ్యర్థికి, మూడు వందల ఓట్లు బిజెపి అభ్యర్థి కి, 200 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పోలైన మొత్తం ఓట్లకు కలపబడతాయి. ఇప్పుడు మళ్లీ ఏ అభ్యర్థి అయినా కోటా సంఖ్య ఓట్లను పొందగలిగాడా అన్నది చూస్తారు. ఒకవేళ ఏ అభ్యర్థి అయిన కోటా సంఖ్య రీచ్ అయితే తను విజేతగా ప్రకటింప పడతాడు. ఒకవేళ రానట్లయితే మళ్లీ చివరి అభ్యర్థిని ఎలిమినేట్ చేసి అతని రెండవ ప్రాధాన్యత ఓట్లను కూడా పైన చెప్పిన విధంగా మిగతా అభ్యర్థులకు కలుపుతారు. కనీసం ఒక్క అభ్యర్థి అయినా కోటా స్థానాన్ని పొందే అంతవరకు ఈ ప్రాసెస్ అలా రిపీట్ చేస్తూనే ఉంటారు. ఇదంతా మ్యాన్యువల్ ప్రాసెస్ కావడంతో ఇంత సుదీర్ఘమైన సమయం పడుతుంది.
ఈ పద్ధతి వల్ల ఏంటి లాభం?
సాధారణ ఎన్నికలలో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తే ఆ పది మందిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు విజేతగా నిలుస్తారు. కానీ ఇందులో ఒక ప్రధాన లోపం ఉంది. ఉదాహరణకి పది మంది అభ్యర్థులు పోటీ పడ్డ ఎన్నికల్లో మొత్తం వంద మంది ఓటు వేశారు అనుకుందాం. ఎనిమిది మంది అభ్యర్థులు చెరో 10 ఓట్లు, తొమ్మిదవ అభ్యర్థి 9 ఓట్లు పొందాడు అనుకుందాం. మిగిలిన పదవ అభ్యర్థి వీరందరి కంటే ఎక్కువగా 11 ఓట్లు పొందిన కారణంగా విజేత అవుతాడు. అంటే 89 శాతం మంది తిరస్కరించిన అభ్యర్థి ఇక్కడ విజేతగా నిలుస్తున్నాడు. ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ రెండవ ప్రాధాన్యత మూడవ ప్రాధాన్యత ఓట్ల ని కూడా పరిగణలోనికి తీసుకోవడం వల్ల ఎక్కువమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న వారే విజేత గా నిలిచే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
ఈ పద్ధతిని భారతదేశం మొత్తానికి ఎందుకు అన్వయించలేదు అంటే?
భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించుకునే క్రమం లో ఓటింగ్ పద్ధతి ఏ విధంగా ఉండాలి అన్నదానిపై కూడా సుదీర్ఘమైన చర్చ జరిగింది. కొన్ని ఇతర దేశాల్లో ఉన్న ఈ ప్రాధాన్యత ఓటింగ్ పద్ధతిని సాధారణ ఎన్నికల్లో తీసుకోకూడదు అన్న నిర్ణయం రాజ్యాంగ కర్తలు తీసుకున్నారు. ఆనాటి భారతదేశంలో ఉన్న అక్షరాస్యత స్థాయిని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి పద్ధతి విశాల భారత దేశానికి ఆ సమయంలో సరిపోదని రాజ్యాంగ రూపకర్త లు భావించారు. పైగా ఈ పద్ధతిలో ఓటింగ్ , కౌంటింగ్ వంటివి విపరీతమైన సమయాన్ని తీసుకోవడం కూడా మరొక కారణం.
మొత్తం మీద ఇదీ Preferential voting మరియు Transferable vote యొక్క కథా కమామిషు
– ZURAN