తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కోటా కావడంతో బలాబలాల ప్రకారం దక్కుతుంది. 24 మంది ఎమ్మెల్యేలకు ఓ ఎమ్మెల్సీ దక్కుతుంది. ఈ లెక్కన మూడు కాంగ్రెస్ కు దక్కుతాయి. ఒకటి బీఆర్ఎస్ ఖాతాలో పడుతుంది. మరో దాని కోసం పోటీ ఉంటుంది. అయితే మజ్లిస్ బలంతో దాన్ని కాంగ్రెస్ గెలుచుకోవచ్చు. పదవీ కాలం ముగుస్తున్న వారిలో ఓ మజ్లిస్ ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి కాంగ్రెస్ అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.
మొత్తంగా మూడు స్థానాలు మాత్రం కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఈ మూడు సీట్ల కోసం చాంతాడంత లిస్టు రెడీగా ఉంది. ముఖ్యంగా సీనియర్లు తమ ప్రతాపం చూపించడం ప్రారంభించారు. ఓ రకంగా వారు బ్లాక్ మెయిల్ రాజకీయాలు ప్రారంభించారని అనుకోవచ్చు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తాటిపర్తి జీవన్ రెడ్డి సీనియర్ గా తనను గుర్తించాలని కోరుతున్నారు. నెగెటివ్ కామెంట్స్ ద్వారా హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా ఆయన పదవి కాలం ముగియబోతోంది.
ఇక అన్ని అవకాశాలు అందినట్లే అంది జారవిడుచుకుంటున్న అద్దంకి దయాకర్ ఈ సారి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తాజాగా తాను బీసీ అంటూ అంజన్ కుమార్ యాదవ్ తెరపైకి వచ్చారు. రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. ఆయన కుమారుడికి రాజ్యసభ ఇచ్చినా తనకూ ఓ పదవి ఇవ్వాలంటున్నారు. ఇక జగ్గారెడ్డి సంగతి చెప్పాల్సిన పని లేదు. పదవి లేక ఆయన గిలగిలలాడుతున్నారు.. సంపత్ కుమార్, ఫిరోజ్ ఖాన్, వేం నరేందర్ రెడ్డి, నీలం మధు కూడా పోటీ పడుతున్నారు.
రేవంత్ రెడ్డి పేర్లు సిఫారసు చేసినా..చేయకపోయినా… ఢిల్లీలోనే అంతా ప్రక్రియ జరుగుతుంది. రేవంత్ రెడ్డి చాయిస్ మేరకు ఒకరి కి అవకాశం కల్పిస్తారని మిగతా హైకమాండ్ చూసుకుంటుందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కన్నా హైకమాండ్ ప్రసన్నం ఉంటే చాలనుకుని చాలా మంది .. ఢిల్లీ బయలుదేరుతున్నారు. అక్కడ కాకా పట్టి పదవిని పట్టేందుకు రెడీఅవుతున్నారు.