తెలంగాణలో గత ఏడాది ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఎన్నికల వేడి.. ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుసగా ఏదో ఒక ఎన్నికల హడావుడితో ఇక్కడి పార్టీలన్నీ తలమునకలై ఉంటున్నాయి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార పార్టీ తెరాస, కాంగ్రెస్, కొత్త ఉత్సాహంతో భాజపా… మూడు పార్టీలూ ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. ఎవరి పాయింటాఫ్ వ్యూలో వారికి ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఈ మూడు ప్రధాన పార్టీలకు ఓరకంగా దిశానిర్దేశం చేస్తాయని చెప్పొచ్చు. రాబోయే నాలుగేళ్లపాటు వారి రాజకీయం ఎలా ఉండబోతోందో తేల్చేవిగా ఉంటాయనీ చెప్పొచ్చు.
తెరాస మీద వ్యతిరేకత మొదలైందని ఇప్పటికే కాంగ్రెస్, భాజపా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో సారూ కారూ పదహారు లక్ష్యాన్ని తెరాస చేరుకోలేకపోయింది. ఆ తరువాత, జెడ్పీలు కైవసం చేసుకున్నా… పట్టణ ప్రాంతాల్లో కేసీఆర్ పాలన మీద వ్యతిరేకత వ్యక్తమౌతోందనే అభిప్రాయం బలంగానే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆ అభిప్రాయంపై స్పష్టత వచ్చేస్తుందని చెప్పొచ్చు. అర్బన్ ప్రజలు నిజంగానే తెరాస మీద కొంత విముఖత ఉంటే.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా ఓటేస్తారు. లేదంటే, అనుకూలంగా ఓటేస్తారు. సో.. ఈ ఫలితాన్ని బట్టీ తెరాస భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో కొన్ని మార్పులూ చేర్పులకు కచ్చితంగా అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే… వరుస ఫిరాయింపులు కొనసాగుతున్నా మూడు చోట్ల ఎంపీ స్థానాలను గెలుచుకుంది. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీని ఇచ్చింది. ఒకవేళ, పార్టీ నాయకులు కాస్త ఐకమత్యంతో ప్రయత్నించి ఉంటే మరిన్ని ఎంపీ స్థానాలు ఆ పార్టీకి దక్కేవనేది వాస్తవం. సీఎల్పీని తెరాస విలీనం చేసుకోవడం, ఫిరాయింపుల్ని యథేచ్ఛగా ప్రోత్సహిస్తూ ఉండటం… ఇవన్నీ తెరాస మీద ప్రజల్లో వ్యతిరేకతను పెంచి, తమకు అనుకూలంగా మారుతున్న అంశాలుగా కాంగ్రెస్ చెబుతోంది. అయితే, మున్సిపల్ ఎన్నికల్లో ఆ మేరకు కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తే… ఇప్పటికే డీలా పడ్డ కేడర్లో కొంత కొత్త ఉత్సాహం రావడం ఖాయం. భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెక్కతడం ఖాయం.
ఇక, భాజపా విషయానికొద్దాం… ఈ పార్టీకి నాలుగు ఎంపీ స్థానాలు రావడంతో రాష్ట్రంలో తామే తెరాసకు ప్రత్యామ్నాయం అంటోంది. పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో వీక్ గా ఉంది కాబట్టి, ఆ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని నేతలు అంటున్నారు. తెలంగాణలో తమనే ప్రజలు ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నారని ప్రకటనలు చేస్తున్నారు. ఒకవేళ ప్రజలు నిజంగానే ఆ తరహా మార్పు బలంగా కోరుకుంటే… మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాజపాకి కొంత సానుకూల ఫలితాలు రావాలి. ఈ ఫలితాల ఆధారంగానే భాజపా వ్యూహాలూ ఉంటాయి. మొత్తానికి, తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు.. మూడు ప్రధాన పార్టీల భవిష్యత్ వ్యూహాలను నిర్దేశించేవిగా కనిపిస్తున్నాయి.