తెలంగాణలో భాజపా దూకుడు మీదుంది.. అనిపిస్తుంది ఆ నలుగురు నాయకుల్ని చూస్తే! కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్. అవకాశం దొరక్కపోయినా దొరకపుచ్చుకుని మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు మీద ఘాటుగా విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అయితే, రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఈ నాయకుల దూకుడులో వాస్తవికత ఎంతనేది తేల్చబోతున్నాయి. పార్టీ బలం కేవలం వీరి ప్రెస్ మీట్లలో మాత్రమే ఉందా, క్షేత్రస్థాయిలో కూడా అదే స్థాయి ఉందా అనేది ఈ ఎన్నికల ఫలితాలు చెప్తాయి.
పార్లమెంటు సభ్యులుగా భాజపా నుంచి నలుగురు గెలిచినా… ఆ గెలుపునకు కారణం స్థానిక తెరాస నాయకుల వైఫల్యమేననీ, దాన్ని పునరావృతం కానివ్వం అంటూ అధికార పార్టీ ఇటీవలే ప్రకటించింది. దీంతో, ఆ నలుగురి గెలుపు భాజపా సొంత బలం కాదనే ప్రచారం తెరాస తెస్తోంది. లేదూ… మాకు మంచి పట్టుందీ, కమలం వికసిస్తోందని చెప్పుకోవాలంటే ఈ ఎంపీ స్థానాల్లో మున్సిపాలిటీలను గెలిచి నిరూపించుకోవాలి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్, వేములవాడ, హుజూరాబాద్, చొప్పదండి, సిరిసిల్ల, హుస్నాబాద్, కొత్తపల్లి, జమ్మికుంట మున్సిపాలిటీలున్నాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్ తోపాటు, భీంగల్, కోరుట్ల, బోధన్, ఆర్మూర్, మెట్ పల్లి మున్సిపాలిటీలున్నాయి. మంత్రి కిషన్ రెడ్డి పరిధిలో జీహెచ్ ఎంసీలో ఇప్పుడు ఎన్నికల్లేవు. చేవెళ్ల, మల్కాజ్ గిరి పరిధిలోని 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల బాధ్యత ఆయనదే. మరో ఎంపీ సోయం బాపు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపోల్స్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ తోపాటు, వివేక్ వెంకట స్వామి, జితేందర్ రెడ్డి… వీళ్లు కూడా భాజపాలో బలమైన నాయకులుగా ఉన్నారు. వీరి బలమెంతో ఈ ఎన్నికలు కచ్చితంగా స్పష్టం చేస్తాయి. రాష్ట్రంలో భాజపాను తామే విస్తరిస్తున్నాం అన్నట్టుగా జాతీయ నాయకత్వం ముందు వీళ్లంతా చెప్పుకుంటూ వస్తున్నారు. అది ఎంతవరకూ వాస్తవం అనేది కేంద్రానికి స్పష్టమయ్యేది కూడా ఈ ఎన్నికలు ద్వారానే. ఓరకంగా రాష్ట్రంలో భాజపా భవిష్యత్తును మున్సిపల్ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. ఏమాత్రం తేడా కొట్టినా, కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కొత్త ఊపు రావడం ఖాయం. ఈ సవాల్ ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.