ఎన్నికలు ఏవొచ్చినా, ఎప్పుడొచ్చినా వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తోంది అధికార పార్టీ తెరాస. ఏ స్థాయి ఎన్నికను కూడా తెరాస ఈజీగా తీసుకోదు. నూటికి నూరుశాతం శ్రద్ధ పెట్టి, సర్వశక్తులూ ఒడ్డి మరీ గెలుపు నమోదు చేసుకుంటుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్ని కూడా అదే స్థాయిలో ఎదుర్కొనేందుకు పార్టీని సమాయత్తం చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల ఆశీర్వాదంతో తెరాస మంచి ఫలితాలు సాధిస్తూ వచ్చిందన్నారు కేటీఆర్. మళ్లీ అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయని నంబర్లు చెప్పడం తనకు ఎప్పుడూ అలవాటు లేదనీ, కానీ అత్యంత గౌరవప్రదమైన ఫలితాలే సాధిస్తామన్నారు. పార్టీ గుర్తు మీద జరుగనున్న ఎన్నికలు కాబట్టి పెద్ద ఎత్తున ఆశావహులున్నారనీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా ముందుకెళ్లాలనేది చర్చించామన్నారు.
విపక్షాల విమర్శలపై స్పందిస్తూ… అధికార పార్టీలు సాధారణంగా ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడానికి ముఖం చాటేస్తాయన్నారు. ఎన్నికలకు సిద్ధమని మొదట్నుంచీ మేం చెబుతున్నామనీ, కానీ కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అవన్నీ నివృత్తి చేశామన్నారు. గడచిన ఆరునెలలుగా ఎందుకు జాప్యం వచ్చిందో అందరూ చూశారన్నారు. కోర్టు సంతృప్తి చెందాక, ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తే, మేం ఎవరితోనో కుమ్మక్కు అయిపోయామని ప్రతిపక్షాలు విమర్శించడం సరైంది కాదన్నారు. ఎన్నికలొస్తే బెంబేలెత్తిపోవడం ఎందుకున్నారు? సొంత సీట్లో ఓడిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో అసంతృప్తితో ఇలా మాట్లాడుతున్నారనీ, అభ్యర్థులను ఎంపిక చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి ఓటెయ్యాలనే అంశంపై కూడా కేటీఆర్ మాట్లాడారు! మరో నాలుగేళ్లపాటు సుస్థిరంగా తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే… ప్రజలకు ఎక్కువగా సేవ చేసే అధికారం ఆ పార్టీకే ఉంటుందన్నారు!
ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు పోటీ కాదన్నట్టుగా కేటీఆర్ మాట్లాడారు. ఇక, మున్సిపోల్స్ లో సత్తా చాటుకుంటామంటూ ప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్న భాజపా ప్రస్థావనే కేటీఆర్ తీసుకురాలేదు! ఆ పార్టీ తెరాస మీద చేస్తున్న విమర్శలూ, పోరాటాలపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నమే ఆయన చెయ్యలేదు. అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి, లేకపోతే కాదు అన్నట్టుగా అన్యాపదేశంగా ప్రజలకు ఇవ్వాల్సిన సందేశాన్నీ ఇచ్చేశారు.