ఇష్టం ఇచ్చిన హామీలు ఇచ్చేశాక, మెడకి చుట్టుకోవడం అంటే ఇదే! ఎన్నికల ముందు చేతికి ఎముక లేదన్నట్టుగా కొన్ని హామీలు ఇచ్చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు ఒక్కోటిగా అవే కొంప ముంచుతున్నాయి. మొన్నటికి మొన్న… సింగరేణి వారసత్వ ఉద్యోగాల అంశం రివర్స్ అయిన సంగతి తెలిసిందే. సర్కారు నిర్ణయంపై కోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది. ఆ బొప్పి తగ్గకముందే.. ఇప్పుడు మరో దెబ్బ పడుతోంది..! ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దాన్ని అమలు చేయడం అనుకున్నంత ఈజీ కాదనే విషయం కేసీఆర్ కు అర్థమౌతోంది.
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమా.. కాదా..? ఆ శాతాన్ని తగ్గించుకోవాలా.. యథాతథంగా అమలు చేయాలా అనే అంశంపై బీసీ కమిషన్ అధ్యయం చేసింది. కేసీఆర్కు నివేదిక అందించింది. దీన్లో కళ్లు బైర్లు కమ్మే అంశాలు పేర్కొంది! ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదనీ, 9 శాతం వరకూ అయితే ఓకే అన్నట్టుగా అందులో అభిప్రాయపడింది. దీంతో గతంలో అపర దాన కర్ణుడిగా కేసీఆర్ ఇచ్చిన ఈ మెగా హామీ, అమలుకు నోచుకోవడం సాధ్యం కాదన్నది దాదాపుగా తేలినట్టే. అయితే, ఇప్పుడు ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవడం కూడా కేసీఆర్కు పెద్ద సవాలుగానే మారింది. ఈ హామీ ఆచరణ సాధ్యం కాదని మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటూ ఉంది. కాకపోతే, ఇదంతా ప్రతిపక్షం గోల అన్నట్టుగా అందరూ తీసి పడేశారు. ఇక, ఈ రిజర్వేషన్లపై భాజపా మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. ఒక్క ఎమ్.ఐ.ఎమ్. తప్ప ఎవ్వరూ దీనికి మద్దతు ఇవ్వరు!
కొత్తగా బీసీ సంఘాలు కూడా ఆందోళన మొదలుపెడుతున్నాయి. ఎందుకంటే, ముస్లింలను బీసీలుగా పరిగణించి, రిజర్వేషన్లు కల్పిస్తే… తమకు తీరని అన్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు. సరే… అధికారం వారి చేతిలో ఉంది కాబట్టి.. ఎలాగోలా ఈ బిల్లు సభలో ఆమోదం పొంది, చట్టంగా మారినా కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే, దీన్ని అమలు చేయడం అనుకున్నంత ఈజీగా కాదు! 2004లో కాంగ్రెస్ ఇలానే ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. ఈ విషయం కోర్టుకు ఎక్కేసరికి.. ఇలాంటివి చెల్లవని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ అనుభవంతోనే మొదట్నుంచీ కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకిస్తోంది.
ఇప్పుడు కేసీఆర్ సర్కారు కూడా ఇదే సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. 14 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చట్టం తీసుకొచ్చినా, రేప్పొద్దున్న ఎవరో ఒకరు దీనిపై కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అప్పుడీ చట్టం మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. నాయకులు, రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన ప్రాథమిక విషయం ఏంటంటే.. మతం ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించడం అనే కాన్సెప్ట్ రాజ్యాంగ స్ఫూర్తికి పక్కా విరుద్ధం. మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం మనది అని ప్రవేశికలోనే చెప్పుకున్నాం. లౌకిక రాజ్యం అంటే అర్థమేంటో కాస్తైనా తెలిసిన రాజకీయ నాయకులు ఎవ్వరూ ఇలాంటి హామీలు ఇచ్చేముందు ఆలోచిస్తారు..! మరి, ఇప్పుడు కేసీఆర్ ఈ హామీ విషయంలో ఎలాంటి లా పాయింట్లు పట్టుకుని నెగ్గుకొస్తారో చూడాలి మరి!