గత కొద్ది రోజులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కాంగ్రెస్ సారధిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరు అని విస్తృత అభిప్రాయ సేకరణ అనంతరం అధిష్టానం.. మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ పగ్గాలు అప్పగించింది.
పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం కోరగా.. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీలకు ఇవ్వాలని భావిస్తే ఎంపీ బలరాం నాయక్ కు ఇవ్వాలని తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పినట్లుగా తెలిసింది. అయితే, ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని పలువురు సీనియర్ నేతలు మాత్రం అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.
సీనియర్ నేత మధుయాష్కీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని.. మహేష్ కుమార్ గౌడ్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపటిన మొదట్లో..సీనియర్ , రేవంత్ వర్గం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగిన సమయంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమన్వయం చేయడం ఆయనకు తాజాగా కలిసి వచ్చింది.
కొన్ని రోజులుగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించడంతో.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఖాయంగా కనిపిస్తోంది.