తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై అధికారిక ప్రకటన తప్ప.. మిగతా మొత్తం క్లారిటీ వచ్చేసినట్లయింది. ముందస్తు ఎన్నికలకు వీలుగా అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ లోగా పెండింగ్ లో ఉన్న హామీలు… తాయిలాలను ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మంత్రివర్గ ముందు ఉంచాల్సిన ఫైళ్లను ఇప్పటికే అన్ని శాఖలు రెడీ చేశాయి. కేబినెట్ భేటీలో ఎన్నికల మీద ప్రభావం చూపే అత్యంత కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఆరు నెలల నిబంధన ప్రకారం సెప్టెంబర్ 28లోగా అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంది. అయితే నాలుగు రాష్ట్రాల తో కలిపి డిసెంబరులోగా ఎన్నికలు జరగాలంటే వీలయినంత తొందరగా అసెంబ్లీని రద్దు చేయాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. అందుకే సెప్టెంబర్ మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు.ఆ తర్వాత మరోసారి మంత్రివర్గం సమావేశం అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణకు ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. బీజేపీకి కూడా ఉపయోగమేనని… కేసీఆర్.. మోడీని కన్విన్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈసీ నుంచి ఓటర్ల జాబితాతో పాటు.. ఇతర అంశాల్లో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని… వాటిని సర్దుబాటు చేయాలని కేసీఆర్ .. ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పూర్తి భరోసాను మోడీ.. కేసీఆర్ కు ఇచ్చినట్లు చెబుతున్నారు. అందుకే… అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఈసీ.. వెనుకడుగు వేయదన్న నమ్మకంతో కేసీఆర్ ఉన్నారు. ఎన్నికల కసరత్తును వేగంగా పూర్తి చేసుకుంటున్నారు.