తెలంగాణలో భూముల వ్యవహారంలో జరుగుతున్న లంచాల బాగోతాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. కీసర తహశీల్దార్… చాలా సులువుగా రూ. కోటికి పైగా లంచం తీసుకుంటూ చిక్కారు. తాజాగా డిప్యూటీ కలెక్టరే తన రేంజ్ మరంత పెద్దని నిరూపిస్తూ దొరికిపోయారు. ఈ రెండు కేసుల్లోనూ.. వారు మాత్రమే.. అవినీతికి పాల్పడలేరని.. వారి వెనుక పెద్ద తలకాలయున్నాయని సులువుగానే అర్థమైపోతంది. అయితే వారు రాజకీయ నేతలు కాదు. ఉన్నతాధికారులే. కీసర ఎమ్మార్వో నాగరాజు వ్యవహారంలో ఓ కలెక్టర్ తీరు వివాదాస్పదమయింది. ఆయనకు నాగరాజు ఓ ఫార్మ్ హౌస్ కొనిచ్చాడని చెబుతున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు బయటకు రావడం లేదు.
ఈ కేసులో నగేష్తో పాటు ఆర్డీవో అరుణ, నర్సాపూర్ తహసీల్దార్ మాలతి, వీఆర్ఏ, వీఆర్వోలు సహా 12 మంది ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఉప్పల్లోని ఆర్డీవో అరుణ ఇంట్లో రూ.26లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కానీ అసలు ఆ భూమి పూర్వపరాలు.. ఇప్పటి వరకూ జరిగిన వ్యవహారాల గురించి మాత్రం దర్యాప్తు చేయడం లేదు. తాజాగా మెదక్ డిప్యూటీ కలెక్టర్ నగేష్ విషయంలోనూ.. ఉన్నతాధికారుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి .. ఎకరానికి లక్ష చొప్పున లంచం బేరంగా మాట్లాడుకున్నారు. అయితే ఆ భూములపై అంతకు ముందు రిజిస్ట్రేషన్ చేయకూడదనే ఉత్తర్వు ఉంది. వాటిని తొలగించడానికి ఉత్తర్వులు వచ్చినా.. తొక్కి పెట్టారు. అలా ఉత్తర్వులు ఎలా వచ్చాయి.. ఎలా తొక్కి పెట్టారనేది.. అసలు కారణం ఏమిటనేదానిపై చర్చ జరుగుతోంది. అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్లే దొంగలు తప్ప.. మిగతా వెనుక ఉండేవారంతా… తప్పించుకోగలిగిన వాళ్లే.
పైగా ఉన్నతాధికారులు అంటే.. సహజంగానే ప్రభుత్వంలో కీలకం. వారు తమపై విచారణల వరకూ రాకుండా.. చేయగలిగినదంతా చేసుకోగలరు. ఈ విషయం సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అందుకే.. కీసర తహశీల్దార్ విషయలలో ఓ కలెక్టర్ ఫార్మ్ హౌస్ గురించి వెలుగులోకి వచ్చినా.. ఎలాంటి ప్రతిస్పందనా లేదు. మెదక్ అడిషనల్ కలెక్టర్ విషయంలోనూ అంతే కావొచ్చు. దొరికిన వాడే దొంగ. మిగిలిన వాళ్లు దొరికే వరకూ దొరలే. ఉన్నతాధికారులు అయితే… దాదాపుగా దొరకకపోవచ్చు కూడా… !