ఒలింపిక్స్ లో సత్తా చాటాలనేది క్రీడాకారులందరి కల. ఆ కల నిజం చేయడానికి అవకాశం వచ్చిన వాళ్లకు మరో ఆకర్షణీయమైన ఆఫర్. తెలంగాన ప్రభుత్వం ఒలింపిక్స్ లో పతకాలు సాధించే వారికి భారీ నజరానా ప్రకటించింది.
ఆగస్టు 5 నుంచి బ్రెజిల్ లోని రియో నగరంలో జరిగే ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధిస్తే ఇక పంట పండినట్టే. ఒలింపిక్ స్వర్ణం సాధిస్తే 2 కోట్ల రూపాయల నజరానా అందుతుంది. అది మిస్సయి, రజత పతకం సాధిస్తే కోటి రూపాయలు గ్యారంటీ. కనీసం కాంస్య పతకం సాధిస్తే 50 లక్షల నగదు బహుమతి ఎదురు చూస్తూ ఉంటుంది.
ఒలింపిక్స్ కు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులను సాగనంపడానికి ఓ సంస్థ ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నజరానాల్ని ప్రకటించారు. రియో నుంచి అందరూ పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఒలింపియన్లు సానియా మీర్జా, పీవీ సింధు, అశ్వనీ పొన్నప్ప, గుత్తా జ్వాల, కిదంబి శ్రీకాంత్ తదితరులను మంత్రి సన్మానించారు. రాష్ట్రం, దేశం గర్వపడేలా ఘన విజయాలను సాధించాలని, క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రావాలని మంత్రి ఆకాంక్షించారు.
ఒలింపిక్స్ లో పాల్గొనే వారు పతకాలు సాధిస్తే భారీ నజరానాలను ప్రకటించడం మంచి ప్రోత్సాహకర ఆలోచనే. అయితే, పాఠశాల స్థాయినుంచే మంచి క్రీడాకారులను తయారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇంకా బాగుంటుంది. కనీసం వ్యాయామ విద్య టీచర్లు కూడా లేని పాఠశాలలే తెలంగాణలో ఎక్కువ.
ఒలింపియన్లు హటాత్తుగా ఎక్కడి నుంచో రారు. ఇక్కడున్న భావి తరం నుంచే రేపటి ఒలింపియన్లు తయారు కావాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చేయూతనివ్వాలంటున్నారు క్రీడాభిమానులు.