తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ తరహాలో అనర్హతా వేటు ముప్పును తప్పించుకోవడానికి ఇలా హాజరవ్వాలని అనుకుంటున్నారు. నిజానికి ఆయన గతంలో కూడాడ ఒక్క రోజు హాజరయ్యారు. బడ్జెట్ రోజున వచ్చి బడ్జెట్ విని వెళ్లిపోయారు. మళ్లీ బడ్జెట్ వినేందుకు వచ్చే చాన్స్ ఉంది.
అసెంబ్లీకి అరవై పని దినాల పాటు రాకపోతే అనర్హతా వేటు వేసేందుకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీలో ఈ అనర్హతా వేటు రాజకీయం జరిగింది కానీ తెలంగాణలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదు. కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే అనర్హతా వేటు వేస్తామని హెచ్చరించలేదు. అయినా కేసీఆర్ కాంగ్రెస్ కు ఎలాంటి చాన్స్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. అందుకే ఒక రోజు హాజరు వేయించుకుంటే..మరో అరవై పనిదినాల వరకూ అసెంబ్లీ వైపు చూడాల్సిన అవసరం ఉండదు.
కేసీఆర్ ఈ మధ్య కాలంలో అమెరికాకు వెళ్లాలనుకుంటున్నారు. అక్కడ కొంత కాలం గడిపి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి రెగ్యులర్ గా కేసీఆర్ హాజరవుతారని కానీ ఇంకా సమయం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పై అనర్హతా వేటు వేసేంత ధైర్యం కాంగ్రెస్ చేయకపోవచ్చు కానీ.. అలాంటి చాన్స్ ఇవ్వకూడదని బీఆర్ఎస్ అనుకుంటోంది. గతంలో సంపత్, కోమటిరెడ్డిలపై అనర్హతా వేటు వేశారు. ఆ కారణం వేరు.
కేసీఆర్ సీనియర్. అందుకే ఒక్క రోజు హాజరు విషయంలో ఆయన గవర్నర్ ప్రసంగాన్ని కాకుండా.. బడ్జెట్ ప్రసంగాన్ని ఎంచుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి జగన్ హాజరయ్యారు.కానీ అది బిజినెస్ డే కాదని అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి.