తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్ ఊహించని విధంగా ఎదురుదాడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్లో బియ్యం కొనుగోలు అంశంలో పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంలో తెలంగాణలో బియ్యం సేకరణలో భారీ అవకవకలు గుర్తించామని ప్రకటించారు. సరిగ్గా ఇదే అంశంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చాలా రోజులుగా విమర్శలు చేస్తున్నారు.
రైతుల పేరుతో రూ. వేల కోట్లు కొల్లగొట్టిన టీఆర్ెస్ నేతల దందా బయటపడబోతోందని చెబుతున్నారు. ఆయన చెబుతున్నదానికి పీయూష్ గోయల్ చెప్పిన దానికి పోలికలు ఉన్నాయి. తక్కువ ధాన్యం కొనుగోలు చేసి రిజిస్టర్లలో ఎక్కువ సేకరించినట్టు నమోదు చేసేవారని..బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఎక్కువ చూపించినదంతా కర్ణాటక నుంచి ఇతర ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ నేతలు స్మగ్లింగ్ చేసి తీసుకు వచ్చి ఎఫ్సీఐకి అమ్మి కోట్లు గడించారని ఆరోపిస్తున్నారు.
ఇది వ్యవస్థీకృతంగా జరిగిందని.. దీనిపై విచారణ చేయాలని అరవింద్ డిమాండ్ చేస్తున్నారు. పక్కాగా అక్రమాలు జరిగాయని కేంద్రమంత్రి పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు విచారణ చేయించడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇటీవలి కాలంలో కేసుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ బట్టి చూస్తే త్వరలో తెలంగాణలో బియ్యం కొనుగోళ్ల స్కాం బట్టబయలయ్యే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.