పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో ముగించేలాని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జనవరి 14న పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తాజాగా ప్రభుత్వం లీకులు ఇచ్చింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. కొన్నిమండలాల్లో ముగ్గురు ఎంపీటీసీలే ఉంటున్నారు. అలాంటి చోట్ల ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.
అలాగే వచ్చే పంచాయితీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఈ బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టనున్నారు. కుల గణన పూర్తి చేసిన తర్వాతే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. దీనికి అనుగుణంగానే కుల గణన కోసం ముందుగా కొత్త బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారు. బీసీ కులగణన ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు పెట్టనున్నారు.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అలాగే శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించింది. మూడు ఫేజ్లలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.