తెలంగాణలో ఉన్న పళంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో.. తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనల్లో ఉన్నారు. గతంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పుడు… బీసీ రిజర్వేషన్లు పెంచి నోటిఫికేషన్ ఇచ్చారు. అది కోర్టులో నిలువలేదు. ఇప్పుడు… పాత నిబంంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదించారు. ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో బీసీ సంఘాలు, వివిధ పార్టీల బీసీ నేతలు ఉద్యమ బాట పట్టారు. జనవరి పదిలోపు పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో.. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇందులో బీసీలకు భారీగా కోత పెట్టారు. ఇదే వివాదాస్పదమయింది.
జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటని.. బీసీ సంఘాలు ఆందోళన ప్రారంభించాయి. ఒక్క టీఆర్ఎస్ బీసీ నేతలు మినహా అందరూ.. ఈ ఆందోళనల్లో పాలు పంచుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ బీసీ నేతలందరూ కలిసి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఓ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆయా పార్టీల నేతలు.. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకునే వరకు వెనక్కి తగ్గేదిలేదని ప్రకటించారు. బీసీలను.. కేసీఆర్ తీవ్రంగా మోసం చేశారని… న్యాయం చేసే వరకూ వదిలి పెట్టబోమని పొన్నాల లక్ష్మయ్య వార్నింగ్ ఇచ్చారు. అఖిలపక్షాన్ని పిలువకుండానే రిజర్వేషన్లపై కెసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. కనీనం పంచాయితీ ఎన్నికల్లోనైనా పూర్తిస్థాయి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల ఓట్లతో గెలిచిన కెసీఆర్….వారికే వెన్నుపోటు పొడిచారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ పార్టీలతో కలిసి బీసీ సంఘాలు భారీ ఆందోళనకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి. గురువారం తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, యూనివర్సీటీల్లో విద్యార్ధుల ఆందోళనలు, శుక్రవారం చీఫ్ సెక్రటరీ, గవర్నర్ ను కలిసి వినతి పత్రాలు, శనివారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల మధ్య ప్రభుత్వం ఏం చేయబోతోందనే ఆసక్తి అంతటా ఏర్పడింది.