గత కొద్ది రోజులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఏ క్షణమైనా పీసీసీ అధ్యక్షుడి పేరును హైకమాండ్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎవరైతే పార్టీని సమన్వయం చేయగలరు అని విస్తృత అభిప్రాయ సేకరణ అనంతరం అధిష్టానం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ .. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ , ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేర్లు పీసీసీ రేసులో ప్రముఖంగా వినిపించాయి. ఓ దశలో మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయిందని ప్రచారం జరిగింది.. ఆ తర్వాత బలరాం నాయక్ వైపు అధిష్టానం మొగ్గు చూపిందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరిగింది.
రేవంత్ విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాక మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యారు. పీసీసీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంపై రేవంత్ అభిప్రాయాన్ని హైకమాండ్ కోరగా..ఎవరిని నియమించినా తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిసింది. ఇక, ఈ విషయంలో మరింత ఆలస్యం చేయవద్దని భావించిన అధిష్టానం…ఏ క్షణమైనా నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది.
తెలంగాణతోపాటు మరో మూడు రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను ప్రకటించనున్నారు. తెలంగాణ పీసీసీ సారధిగా మహేష్ కుమార్ గౌడ్ , వెస్ట్ బెంగాల్ పీసీసీ చీఫ్ గా దీపాదాస్ మున్షీ , కేరళ పీసీసీ అధ్యక్షుడిగా కేసీ వేణుగోపాల్ పేర్లను ఖరారు చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షీకి వెస్ట్ బెంగాల్ పార్టీ అద్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించడంతో.. ఆమె స్థానంలో చత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ను ఇంచార్జ్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది.