తెలంగాణ పోలీసులు స్వరం మార్చారు. తెలుగుదేశం పార్టీ యాప్ సేవా మిత్రలో.. తెలంగాణ ప్రజల డేటా కూడా ఉందంటూ కొత్త వాదన ప్రారంభించారు. వైసీపీ నేతలు చేసిన రెండు ఫిర్యాదులను.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.. తెలంగాణ ప్రభుత్వం. దానికి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తున్నారు. ఈ రోజంతా.. ఆయనతో పాటు ఆయనకు కేటాయించిన తొమ్మిది మంది సీనియర్ అధికారులతో రోజంతా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం తర్వాత డీజీపీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ కేసు చాలా క్లిష్టమైనది.. ఎన్నో సాంకేతిక అంశాలు ఉన్నాయని.. అందుకే విచారణ కోసం… ప్రత్యేకంగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారితో మరో సిట్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఐటీ గ్రిడ్ నుంచి స్వాధీనం చేసుకున్న సర్వర్లలోకొంత సమాచారం సేకరించామన్నారు. అలాగే యాప్‌లో తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా ఉందన్నారు. దాన్ని ఎలా సేకరించారో.. ఎందుకు వినియోగించారో తెలుసుకుంటామన్నారు. వీటి ద్వారా ఓట్లు తొలగించారన్న అనుమానం ఉందని… దర్యాప్తు చేస్తామన్నారు. ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ అమెరికాలో ఉన్నా.. అమరావతిలో ఉన్నా పట్టుకుంటామని.. చట్టం ముందు అంతా సమానమేనని స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు.
మార్చి రెండో తేదీన కేసు పెట్టినప్పటి నుంచి.. అటు సైబరాబాద్ కమిషనర్, ఇటు హైదరాబాద్ కమిషనర్ ఇద్దరూ.. ఏపీ ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేస్తూ మాట్లాడారు. దీనిపై.. వారి దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో మాత్రం వివరించలేదు. ఏపీ ప్రభుత్వ సమాచారం లీక్ కాలేదని.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న తెలంగాణ పోలీసులపై ప్రభుత్వ పరంగా.. పరువు నష్టం దావా వేయాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమయంలోనే… ఒక్క సారిగా.. సిట్ తెరపైకి వచ్చింది. సీట్ కు నేతృత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర… సేవామిత్ర యాప్‌లో వ్యక్తిగత సమాచారం ఉందని.. మాత్రమే చెప్పుకొచ్చారు. ఇది చాలా క్లిష్టమైన కేస్ అన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ కావాలన్నారు. అలాగే.. తమ డేటా దుర్వినియోగం అయిందని ఎవరైనా భావిస్తే.. సిట్ కు ఫిర్యాదు చేయవచ్చని.. కేసు పరిధిని విస్తృతం చేసే ప్రయత్నం చేశారు.
కేసు నమోదు చేసినక సమయంలో.. ఏపీ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత డేటాను.. ఐటీ గ్రిడ్ సంస్థకు ఇచ్చిందని.. అటు కేటీఆర్‌తో పాటు.. ఇటు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. స్టీఫెన్ రవీంద్ర మాత్రం భిన్నంగా మాట్లాడారు. సిట్ టీమ్ స్పందన చూస్తే… ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం ఏదీ … ఐటీ గ్రిడ్ వద్ద లేదని… ఏపీ ప్రభుత్వ అధికారిక సమాచారం ఏమీ లేదని అర్థమవుతుందంటున్నారు.
నిజానికి సేవామిత్ర యాప్.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యాప్ అని టీడీపీ వర్గాలు ముందు నుంచీ చెబుతున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన… అంటే తెలంగాణకు చెందిన కార్యకర్తల వివరాలు కూడా ఉన్నాయని.. వారందరూ.. స్వచ్చందంగా సమాచారం ఇచ్చి.. తమ సభ్యత్వం నమోదు చేసుకున్నారని.. టీడీపీ వర్గాలు ముందు నుంచీ చెబుతున్నాయి. తెలంగాణలోనూ టీడీపీకి ఇప్పటికీ 10లక్షల మంది సభ్యత్వం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయ. ఈ విషయం పోలీసు వర్గాలకు పూర్తిగా తెలిసినా.. రాజకీయ కారణాలతో.. పౌరుల వ్యక్తిగత సమాచారం అంటూ.. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. మరో వైపు ఈ యాప్ లో ఉన్న కార్యకర్తల సమాచారం అంతా.. వైసీపీకి చేరిపోయిందని.. తెలంగాణ పోలీసులే దొంగతనం చేశారంటూ.. ఇప్పటికే కేసు నమోదైంది. కార్యకర్తల సమాచారాన్ని సామాన్య ప్రజల సమాచారంగా చెప్పి… తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.