ఎన్నికలకు ముందు.. తెలుగుదేశం పార్టీ అధినేతపై కుల పరంగా విమర్శలు చేసిన ప్రముఖులందరికీ… ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పదవుల పందేరం చేస్తున్నారు. వీరిలో తెలంగాణ వారే అధికంగా ఉంటున్నారు. కొత్తగా… ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ గా వంగాల ఈశ్వరయ్య గౌడ్‌ను.. నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంగాల ఈశ్వరయ్య గౌడ్ ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. రిటైర్ అయిన తర్వాత బీసీ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈశ్వరయ్య నల్లగొండ జిల్లాకు చెందినవారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. చంద్రబాబు… బీసీలను అణగదొక్కుతున్నారని.. వారు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకుంటున్నారంటూ.. ఆరోపించారు. ఆ తర్వాత కూడా ఆయన ఆ తరహా ఆరోపణలు కొనసాగించారు. సాక్షి మీడియా… ఈశ్వరయ్య విమర్శలను బ్యానర్ కథనాలుగా మార్చి.. చంద్రబాబు.. బీసీ వ్యతిరేకి అని తీర్పు ఇచ్చేది.
ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ గా నల్లగొండ వాసి..!
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత … కీలకమైన చట్టాలను తెచ్చారు. కొన్నింటిని సవరించారు. అలాంటి వాటిలో.. విద్యా వ్యవస్థపై కూడా చేసిన చట్టాలున్నాయి. ప్రైవేటు పాఠశాల్లో ప్రతి విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూలు, ఉ న్నత ప్రమాణాలు పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయాలని చట్టం చేశారు. వీటికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉంటారని నిర్దేశించింది. ఉన్నత విద్యా కమిషన్‌కు… వంగాల ఈశ్వరయ్యను నియమిస్తున్నారు. ఈ కమిషన్లలో ఆయా రంగాల నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. వంగాల ఈశ్వరయ్య చైర్మన్ కానున్న ఉన్నత విద్యా కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యల తీసుకునే అధికారం ఉంది. గుర్తింపు రద్దు చేసే అధికారం కూడా ఉంది.
తటస్తుల కోటాలో టీడీపీపై విమర్శలు చేసిన వారికి పదవుల పందేరం..!
వ్యవస్థలను మార్చడానికి చట్టాలు మార్చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ నియామాకాలు చేపడుతూండటం వివాదాస్పదమవుతోంది. లోకాయక్తగా… టీడీపీ సర్కార్ పై విమర్శలు చేసిన పి.లక్ష్మణ్ రెడ్డి అనే విశ్రాంత న్యాయమూర్తిని నియమించారు. ఉన్నత విద్యా కమిషన్ గా.. కుల పరంగా… గత టీడీపీ సర్కార్ పై విమర్శలు చేసిన రిటైర్డ్ న్యాయమూర్తినే నియమిస్తున్నారు. చట్ట పరంగా… కీలకంగా ఉండే వారందర్నీ.. ఇలా రాజకీయ నియామకాలతో సరిపెడుతూండటంతో… జగన్ కోరుకునే.. వ్యవస్థల్లో మార్పు ఎలా సాధ్యమన్న చర్చ.. జోరుగా నడుస్తోంది. తటస్తుల ముసుగులో.. టీడీపీ సర్కార్ పై విమర్శలు చేసిన వారందరికీ.. ఏ రాష్ట్రమనేదానితో సంబంధం లేకుండా.. పదవుల పందేరం జరుగుతోందన్న విమర్శలు సహజంగానే వినిపిస్తున్నాయి.
75 శాతం రిజర్వేషన్ల చట్టం జగన్ పాటించరా..?
తెలంగాణ వారికి కీలకమైన పదవుల్ని కట్టబెట్టడానికి ఏపీ సర్కార్ చాలా ఆసక్తి చూపిస్తోంది. ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే.. 75 శాతం స్థానికులే ఉద్యోగాలివ్వాలని.. చట్టంచేసిన జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ … నియామకాలు మాత్రం.. తెలంగాణ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే సీఎం పేషీలో… తెలంగాణ నుంచి వచ్చిన వారే అత్యధికంగా కనిపిస్తున్నారు. పీఆర్వో టీం మొత్తం తెలంగాణ డామినేషన్ కనిపిస్తోంది. నామినేటెడ్ పోస్టుల్లోనూ… తెలంగాణవారిని నియమిస్తున్నారు. చివరికి ఏపీలో ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ గా.. కనీసం ఏపీకి చెందిన వ్యక్తిని నియమించలేకపోయారు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. తెలంగాణ వారికి కీలక పదవులిస్తున్నారు.