రుణభారంతో సతమతమవుతున్న తెలంగాణ సర్కార్‌ను భూములు ఆదుకుంటున్నాయి. గత రెండేళ్ల నుంచి వచ్చిన రియల్ భూమ్ కారణంగా… ఔటర్ రింగ్ రోడ్డు దాటి పది కిలోమీటర్ల వరకూ.. ఎకరం కోట్లలోకి చేరిపోయింది. అన్ని చోట్లా ప్రభుత్వానికి విలువైన భూములున్నాయి. అయితే ప్రభుత్వ భూముల అమ్మకం అంటే ఆషామాషీకాదు. ఎన్నో చిక్కులు ఉంటాయి. ముఖ్యంగా కొనుగోలు దారుల నమ్మకాన్ని పొందాల్సి ఉంటుంది. అందుకే మొదటగా 65 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. ఇవి కూడా అత్యంత ఖరీదైనవి. హాట్ కేక్‌లుగా ఉన్న కోకాపేట భూములనే మొదటగా అమ్ముతున్నారు.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్తో పాటు హెచ్ఎండిఏ ఈ – ఆక్షన్ వేలానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసారు.ఈ నెల 15న హెచ్ఎండిఏ కోసం ప్రకటన, 25న ఫ్రీ-బిడ్ సమావేశం, వచ్చే నెల 13ను రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా ప్రకటించింది. ఈఎండీ చెల్లింపుకు జూలై 13న అదే రోజు సాయంత్రం ఐదు వరకు అవకాశం ఉంది. ఇక ఈ – ఆక్షన్ వేలానికి చివరి తేదీ వచ్చే నెల 15గా నిర్ణయించింది. ఈ బిడ్ సక్సెస్ అయితే.. ఆ తర్వాత కొనుగోలుదారులు మరింత ఎక్కువ మంది వస్తారు. మొత్తంగా ముఫ్పై ఐదు వేల కోట్ల రూపాయలను భూముల అమ్మకాల ద్వారా సంపాదించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
ప్రభుత్వ భూములను విక్రయించాలన్న సర్కారు నిర్ణయంపై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏం చేసి అయినా అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. కోర్టులకు వెళ్తామంటున్నారు. అయితే టీఆర్ఎస్ ఘుటుగానే కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ సర్కారు 88వేల ఎకరాలు అమ్మిందని మండిపడ్డారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయినపుడు ప్రభుత్వ భూములను అమ్మడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా… సర్కార్ మాత్రం భూములను అమ్మి ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అమ్ముతోంది..విలువ పెరిగిన ఆస్తులే కానీ… మార్కెట్లు… కలెక్టరేట్లు కాదు కాబట్టి తప్పేమిటన్నవాదనను కొంత మంది వినిపిస్తున్నారు.