చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఓ రాజకీయ కార్యక్రమం పెట్టుకున్నారు. గజ్వేల్ వెళ్లి దళిత బంధు రాలేదని చేసిన కొంత మంది ఫిర్యాదుల మేరకు వారిని పరామర్శించాలనుకున్నారు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. షర్మిల వెళ్తే ఏంటి.. వెళ్లకపోతే ఏంటి అనుకున్నారు. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం అలా అనుకోలేదు. ఆమె బయలుదేరే సమయానికి లోటస్ పాండ్‌లో మోహరించారు. ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాజకీయం గురించి కాస్త ఆసక్తి ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు. షర్మిలను కూడా హౌస్ అరెస్ట్ చేసేంత రాజకీయం ఏముందబ్బా అనుకున్నారు. బీఆర్ఎస్ షర్మిల పర్యటకు భయపడుతుందా లేకపోతే.. షర్మిలకు లేనిపోని ప్రయారిటీ ఇవ్వడానికి ఈ పని చేశారా అని చర్చలు ప్రారంభించారు. ఇలాంటి అడ్డుకోవడం అనే సన్నివేశాల్లో ఎలా రాజకీయ మైలేజీ తెచ్చుకోవాలో షర్మిలకు బాగా తెలుసు. దానికి తగ్గట్లుగా ఆమె పర్ఫార్మెన్స్ చేశారు. పోలీసులకు హారతి ఇవ్వడం లాంటివి చేశారు. చివరికి ఇంట్లోనే దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు . షర్మిల రాజకీయ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి జరిగిన చర్చలు ఫలప్రదం అయ్యాయో లేదో స్పష్టత లేకుండా పోయింది. తెలంగాణ నేతలెవరూ.. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదు . కానీ షర్మిల మాత్రం.. తెలంగాణలో ఉండాలనుకుంటున్నారు. కాంగ్రెస్ మత్రం.. ఏపీలో అయితే వెంటనే పీసీసీ చీఫ్‌ను చేస్తామని చెబుతున్నారు. షర్మిల ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.