అమరావతి ప్రాంగణం వద్ద భద్రతా చర్యలకోసం అవసరమైనన్ని పోలీసు జాగిలాలు ఆంధ్రపోలీసుల వద్ద లేకపోవడంతో తెలంగాణ పోలీసు జాగిలాలను రప్పించారు. వీఐపీలు, వీవీఐపీలు బస చేసే ప్రాంతం, వారు రాకపోకలు సాగించే మార్గాల్లో ఈ బృందాలు అణవణువూ తనిఖీ చేస్తున్నాయి. కొన్ని బృందాలు ఉద్దండరాయునిపాలెంలోని సభా వేదిక, హెలీప్యాడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, ముఖ్యులు అసీనులయ్యే ప్రదేశాల్లో గత రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నాయి. అత్యంత ప్రముఖులంతా ముందుగా గన్నవరం విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి ఉద్దండరాయునిపాలెం వెళ్లనున్నందున విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున జాగిల తనిఖీ బృందాలు గాలిస్తున్నాయి.
అమరావతి శంకుస్థాపన మహోత్సవం అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణానికి తెరతీసింది. ఇంత కాలం ఉప్పు, నిప్పుగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ మనసు విప్పి మాటాడుకోవడానికి అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రిక దోహదపడింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏర్పడిన ఈ సామరస్యం రాష్ట్రాల అధికారుల స్థాయికి, అక్కడ నుంచి ప్రజలకు విస్తరిస్తున్నదనడంలో సందేహం లేదు. అందుకు పోలీసు జాగిలాల సహకారం ఒక నిదర్శనమే.