మాదాపూర్‌లో పని చేస్తున్న ఓ ఐటీ ఉద్యోగి కిడ్నాపయ్యారంటూ… గుంటూరులో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో.. విచారణ కోసం.. ఏపీ పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారు. అయితే.. విచారణలో.. తెలంగాణ పోలీసులే ఆ ఐటీ ఉద్యోగిని తీసుకెళ్లారని తేలింది. ఈ విషయం వెనుక రాజకీయ కోణం బయటపడింది. రెండు రోజుల కిందట.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి.. ఏపీ ఓటర్ల జాబితా…టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీల వద్ద ఉన్నాయని చెబుతూ… ఓ ఫిర్యాదు పోలీసులకు ఇచ్చారు. ఆ ఫిర్యాదుకు ఒక్క ఆధారం కూడా జత చేయలేదు. ఆ ఫిర్యాదు ఆధారంగా.. టీడీపీకి ఐటీ సేవలు అందించే.. రెండు కంపెనీలపై పదుల సంఖ్యలో పోలీసులతో దాడులు చేశారు తెలంగాణ పోలీసులు. హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీలకు ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై ఏపీ నుంచి పోలీసులు మాదాపూర్‌కు రావడంతో ఈ సోదాల వ్యవహారం 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీకి సేవామిత్ర అనే యాప్ ఉంది. దీనితో బూత్ లెవల్ కమిటీ ల వివరాలు ఉంటాయి. పార్టీ కార్యక్రమాలపై.. వారు ఆ యాప్ ద్వారా దిశానిర్దేశం చేసుకుంటారు. ఈ యాప్ ను ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలుగుదేశం పార్టీకి యాప్ తయారుచేసి ఇచ్చింది. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ..ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన లబ్దిదారులకు… ఎస్సెమ్మెస్ సేవలు అందిస్తున్నారు. ఓటర్ల వివరాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగానే.. హుటాహుటిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం నుంచి తనిఖీలు ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగి కుటుంబ సభ్యుల ఫిర్యాదు అందడంతో.. అర్థరాత్రి ఏపీ పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయం వద్ద కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ విషయంపై ముందుగానే సమాచారం ఉండటంతో… చంద్రబాబునాయుడు కర్నూలులో.. టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని గుర్తు చేశారు. మోడీ, జగన్, కేసీఆర్‌లు.. కలిసి.. టీడీపీని దొంగ పద్దతుల్లో దెబ్బ కొడదామని ప్రయత్నిస్తున్నారని.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మొత్తానికి హైదరాబాద్ కేంద్రంగా.. టీడీపీని టార్గెట్ చేసిన వ్యవహారాల్లో.. ఐటీ కంపెనీలనూ.. వదిలి పెట్టకపోవడం కలకలం రేపుతోంది.