బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ చోటా, బడా సెలబ్రిటీలపై కేసులు పెడుతున్న పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు యాప్ నిర్వాహకులు తప్పు చేస్తే వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న బెట్టింగ్ సొమ్మును స్వాధీనం చేసుకోకుండా.. ప్రమోట్ చేసిన వారిపై కేసులు పెట్టడం ఏమిటని వస్తున్న విమర్శలకు స్పందించారు. ఇక నుంచి ఆ సెలబ్రిటీలు నేరస్తులుగా కాకుండా సాక్షులుగా చూడాలని అనుకుంటున్నారు. వారి ద్వారా బెట్టింగ్ యాప్స్ ఓనర్లు ఎవరో కనిపెట్టి వారిపై కేసులు పెట్టాలనుకుంటున్నారు.
బెట్టింగ్ యాప్స్ ఓనర్లు ఎవరో కనిపెట్టడం పెద్ద విషయం కాదు. అదేమీ రహస్యంగా జరిగే వ్యాపారం కాదు. యాప్స్ ద్వారా టెక్నికల్ గా జరుగుతాయి. లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతాయి. వాటి ద్వారా యాప్ ఓనర్లను పట్టుకుని జైల్లో పెట్టడం పెద్ద విషయం కాదు. పోలీసులకు అంత పెద్ద నెట్ వర్క్ ఉంటుంది. అయితే వీడియోకు ఇంత అని వసూలు చేసుకునే ఇన్ ఫ్లూయన్సర్లను నిందితులుగా మార్చడం వల్లనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఎంతో కాలం నుంచి వారు చేస్తున్నప్పటికీ ఎప్పుడూ పోలీసులు ఇది తప్పు అని చెప్పలేదు. అందరూ చేస్తున్నారు కాబట్టి తాము కూడా చేసి డబ్బులు సంపాదించుందామన్న ఆలోచనలో వారు తమ ప్రమోషన్ చేశారు. వీరిని అరెస్టు చేయడం ప్రారంభిస్తే.. చాలా మందిని చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. అందుకే పోలీసులు వారిని సాక్షులుగా మార్చి అసలు నిందితుల్ని పట్టుకోవాలని డిసైడయ్యారు.